ఈ మొక్క ఉంటే అదృష్టమేనట.

0
256

చైనా ఫెంగ్‌షైయ్‌ వాస్తులో జేడ్‌ మొక్కకు ప్రాధాన్యం
వ్యాపార వృద్ధికి తోడ్పడుతుందనే నమ్మకంతో ఆఫీసుల్లో సైతం పెంపకం
నగరంలో మొక్కపై పెరుగుతున్న ఆశక్తి
హైదరాబాద్: నగర వాసులకు పచ్చదనం, మొక్కల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. ట్రాఫిక్‌, కాలుష్య వాతావరణంలో గడిపే నగర వాసులు పచ్చని చెట్లతో ఆహ్లాదం పొందాలని చూస్తున్నారు. అందుకే ఇంటి డాబాపైన, గార్డెన్‌లోనే కాకుండా ఆఫీసులోసైతం మొక్కల పెంపకానికి మొగ్గుచూపుతున్నారు. చైనా వారు అమితంగా నమ్మే ఫెంగ్‌షూయ్‌ వాస్తు ప్రకారం మొక్కలను కొనుగోలు చేస్తూ వాటిని ఇంట్లో, ఆఫీసుల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు లాఫింగ్‌బుద్ధ, లక్కీ బ్యాంబూట్రీ లాంటి వాటిని నమ్మిన నగర వాసులు నేడు జేడ్‌ మొక్కలను పెంచుతున్నారు.

డబ్బును ఆకర్షిస్తుందనే నమ్మకం…
జేడ్‌ మొక్క ఆకులు పచ్చరంగులో ఉండడంతో దీనికి ఆపేరు వచ్చిందని చైనీయులు నమ్ముతారు. జేడ్‌ను లక్కీప్లాంట్‌, మనీ ప్లాంట్‌ట్రీ, ఫ్రెండ్‌షిప్‌ ట్రీ, స్టోన్‌ లోటస్‌ అని కూడా పిలుస్తారు. ఈమొక్క చాలా ఏళ్ల వరకు బతుకుతుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఫెంగ్‌షూయ్‌ వాస్తులో ఈ మొక్కకు ప్రాధాన్యం ఎక్కువ. ఫెంగ్‌షూయ్‌ వాస్తు ప్రకారం… జేడ్‌ మొక్క మానసిక ప్రశాంతనిస్తుందని, డబ్బును ఆకర్షిస్తుందని, వ్యాపారాన్ని పెంచుతుందని నమ్మకం. కొన్ని దేశాల్లో ఈ మొక్కను బహుమతిగా కూడా ఇస్తుంటారు.

జేడ్‌ మొక్కను పెంచండిలా…
ఈ మొక్కను పెంచడం చాలా సులువు. ఇది సక్యులెంట్‌ జాతికి చెందిన మొక్క కావడంతో సూర్య కాంతి, కృత్రిమ వెలుతురు అయినా బాగానే పెరుగుతుంది. వర్మీకంపోస్ట్‌, వేప పిండి కలిపిన మట్టి మిశ్రమంలో ఈ మొక్కను నాటుకుంటే సరిపోతుంది. మూడు నెలలకొకసారి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరువును, నెలకొకసారి వేప కషాయం కొద్దిగా వేస్తుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది. నీటి అవసరం తక్కువ కాబట్టి దీనిని ఆఫీస్‌లో టేబుల్‌ పైనా పెట్టుకోవచ్చు. ఈ మొక్క ఒకే కుండీలో ఏళ్ల తరబడి పెరుగుతుంది. ప్రూనింగ్‌ ద్వారా చిన్నగా పొందిగ్గా బోన్సాయ్‌లా పెంచు కోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఎండలో పెంచినపుడు చిన్న చిన్న తెల్లని లేదా గులాబీ రంగు పూలు పూస్తుంది. సాధారణంగా అన్ని నర్సరీల్లోనూ ఈ మొక్కను పెంచుతారు.