ఉక్కులాంటి ఎముకల కోసం!

0
51

20 ఏళ్ల శ్వేతకు నాలుగు మెట్లెక్కిందంటే మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. 40 ఏళ్ల లావణ్యకు అప్పుడే ఎముకలు గుల్లబారటం మొదలుపెట్టాయి. 60 ఏళ్ల సుగుణ తుంటి ఎముక విరిగి మంచం పట్టింది. పూర్వంతో పోలిస్తే మహిళల్లో ఎముకల సమస్యలు ఇప్పుడు మరింత సాధారణమైపోయాయి. ఎముకల పటిష్ఠత క్రమేపీ తగ్గుతోంది.
జీవనశైలి, ఆహారపుటలవాట్లు, వ్యాయామలోపం…ఇలా ఎముకల పటుత్వం తగ్గటానికి బోలెడన్ని కారణాలు. మరి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి? పుట్టింది మొదలు వృద్ధాప్యం వరకూ ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి?
శరీరానికి ఆకృతినిచ్చి, అంతర్గత అవయవాల్ని కాపాడుతూ, కండరాలకు దన్నునిస్తూ, క్యాల్షియమ్‌ను నిల్వ చేసుకునే కీలకమైన నిర్మాణాలు ఎముకలు. కాబట్టి బాల్యం, యౌవనాలలో ఎముకల దృఢత్వాన్ని సాధ్యమైనంత ఎక్కువగా పెంచుకోవాలి. లేదంటే అవి తేలికగా అరగటం, విరగటంతోపాటు వృద్ధాప్యంలో విపరీతంగా బాధిస్తాయి. ఎముకలు పటిష్ఠంగా ఉండాలంటే క్యాల్షియం అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఆ క్యాల్షియంను ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఏం తింటే క్యాల్షియం సమృద్ధిగా శరీరానికి అందుతుంది? అనే విషయాల గురించి అవగాహన ఉండదు.

ఎముకలెందుకు గుల్లబారతాయి?
చాలామంది ఎముకలు వయసుతోపాటు వాటంతటవే పెరుగుతాయి అనుకుంటారు. కానీ నిజానికి ఎముకలు పెరిగే క్రమంలో ఎన్నో మార్పులకు లోనవుతాయి. అవెప్పుడూ ఒకేలా ఉండవు. పుట్టింది మొదలు ప్రతి సంవత్సరం 10 శాతం బోన్‌ స్టాక్‌ డిపాజిట్‌ అవుతూ ఉంటుంది, అంతే పరిమాణంలో విత్‌డ్రా అవుతూ ఉంటుంది. అంటే…పాత ఎముకలు నశించి కొత్త ఎముకలు తయారవుతూ ఉంటాయి. ఎముకల సాంద్రత వయసుతోపాటు పెరుగుతుంది. 30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి.

ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకునే క్యాల్షియంను ఎముకలు పీల్చుకుంటాయి. ఒకవేళ రక్తంలో క్యాల్షియమ్‌ స్థాయి తక్కువగా ఉంటే ఎముకల మజ్జ నుంచి క్యాల్షియం రక్తంలోకి విడుదలవుతుంది. ఎముకలకే క్యాల్షియమ్‌ సరిపోకపోతే రక్తం నుంచి శోషించుకుంటాయి. ఇలా ఎముకలు, రక్తం…రెండిట్లో క్యాల్షియం స్థాయులు సక్రమంగా ఉన్నంతకాలం ఎటువంటి సమస్యా ఉండదు. ఎప్పుడైతే ఈ సమతౌల్యం అదుపు తప్పుతుందో అప్పుడే ఎముకలు గుల్లబారటం, బలహీనపడటం మొదలవుతుంది. అలాగే సహజసిద్ధంగానే 30 ఏళ్ల వరకూ పెరుగుతూ వచ్చిన ఎముకల సాంద్రత అప్పటి నుంచి తగ్గటం మొదలుపెడుతుంది. దాంతో ఆస్టియోపొరోసిస్‌, ఎముకలు తేలికగా విరిగిపోవటం మొదలైన సమస్యలు మొదలవుతాయి.

ఇలా జరగకుండా ఉండాలంటే….
30 ఏళ్ల లోపు వరకూ సాధ్యమైనంత ఎక్కువ క్యాల్షియమ్‌ను తీసుకోవటంతోపాటు, ఆ తర్వాత దాని పరిమాణాన్ని జీవనశైలి, వయసుల ఆధారంగా పెంచుతూ ఎముకల్ని బలంగా ఉంచుకోవాలి.
ఎముకలపె ప్రభావం చూపే అంశాలు ఇవే!
ఆహారంలో క్యాల్షియం: క్యాల్షియం తగినంత లేని ఆహారం తీసుకోవటం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. చిన్న వయసులోనే బోన్‌ లాస్‌ జరిగి ఎముకలు విరిగే అవకాశాలు పెరుగుతాయి.
అస్తవ్యస్త ఆహార వేళలు: సమయానికి తినకపోవటం, తగినంత తినకపోవటం వల్ల కూడా క్యాల్షియమ్‌ను తగినంతగా శరీరం శోషించుకోలేదు.
పాలకు బదులు టీ, కాఫీలు: పాలు తాగే అలవాటు అందరిలో కొరవడుతోంది. టీ, కాఫీలు తాగుతున్నాం కాబట్టి పాలు తాగినట్టే అనుకుంటే పొరపాటు. కానీ టీ, కాఫీల్లో ఉండే ఫైటేట్స్‌ క్యాల్షియమ్‌ను శరీరం శోషించుకోనివ్వకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పాలను నేరుగా తాగాలి.
వ్యాయామం అవసరం: వ్యాయామం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. బాల్యంలో, యుక్త వయసులో వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.
మద్యపానం, ధూమపానం: ఈ వ్యసనాల వల్ల ఎముకల్లోని క్యాల్షియం అవసరానికి మించి రక్తంలోకి విడుదలవుతూ శరీరం నుంచి బయటికి వెళ్లిపోతూ ఉంటుంది. ఫలితంగా ఎముకలు గుల్లబారతాయి.
వయసురీత్యా: వయసు పైబడేకొద్దీ ఎముకలు పలుచనై, బలహీనపడతాయి.
వంశపారంపర్యంగా: తల్లితండ్రుల్లో ఆస్టియోపోరోసిస్‌ ఉంటే పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది.

పటుత్వాన్ని నిలకడగా ఉంచే హార్మోన్లు
పురుషుల్లో టెస్టోస్టిరాన్‌, స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల పరిమాణం తగ్గితే ఆ ప్రభావంతో క్యాల్షియమ్‌ను ఎక్కువగా నష్టపోయి ఎముకలు పటుత్వం కోల్పోతాయి. స్త్రీలలో మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తయారీ ఆగిపోతుంది. దాంతో క్యాల్షియం ఎముకల్లో నిల్వ ఉండకుండా ఎక్కువగా విడుదలైపోతూ ఉంటుంది. అందువల్లే రుతుక్రమం ఆగిపోయిన తర్వాత, 60 ఏళ్ల వయసు మహిళల్లో సాధారణంగా ఎముకలు గుల్లబారే ఆస్టియోపోరోసిస్‌ సమస్య కనిపిస్తూ ఉంటుంది. దాంతో జారిపడ్డప్పుడు లేదా చిన్నపాటి దెబ్బలకే తుంటి ఎముక, వెన్ను, కీళ్ల దగ్గర ఎముకలు విరుగుతూ ఉంటాయి.

అలాగే పురుషుల్లో కూడా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తయారీ తగ్గటం వల్ల ఆస్టియోపోరోసిస్‌ తలెత్తుతుంది. చిన్న వయసులో ఈ హార్మోన్‌ సమస్యలేవీ ఉండవు కాబట్టి ఎముకల్లో క్యాల్షియం నిల్వ సక్రమంగా ఉండి ఎముకలు విరిగినా త్వరగా అతుక్కోవటం, నయం అయిపోవటం జరుగుతుంది. పెద్దల్లో ఈ వేగం తగ్గుతుంది. దీనికితోడు ఽధూమపానం, మద్యపానాల వల్ల ఎముకల్లో క్యాల్షియం నిల్వ తగ్గి తరుగుదల పెరుగుతుంది. ఫలితంగా ఎముకలు తేలికగా విరిగిపోతూ ఉంటాయి. విరిగిన ఎముకలు అతుక్కోవటానికి కూడా ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది.

రోజుకి వెయ్యి మిల్లీగ్రాములు
ప్రతి వ్యక్తికీ రోజుకి కనీసం 1 గ్రాము క్యాల్షియమ్‌ అవసరం. ఇంత పరిమాణాన్ని చిన్న వయసు నుంచే ఆహారం ద్వారా అందేలా చూసుకోవాలి. ఇందుకోసం…
ప్రతిరోజూ పాలు తాగాలి.
బాదం, పిస్తా, నువ్వులు, పప్పులు తినాలి.
రాగులు, మొక్కజొన్న మొదలైన చిరుధాన్యాలు.
పెరుగు, జున్ను లాంటి పాల ఉత్పత్తులు
డైట్‌ పాటించాలనుకునేవాళ్లు స్కిమ్‌డ్‌ మిల్క్‌ తాగాలి.
చేప నూనె (కాడ్‌ లివర్‌ ఆయిల్‌)
సీతాఫలం, సపోటా లాంటి నూకలుగా ఉండే పళ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా తింటూ ఉండాలి.
పాలు కాచినప్పుడు బరువుగా ఉండే క్యాల్షియం నూకలాగా పాల అడుగున పేరుకుంటుంది. కాబట్టి పాలు గ్లాసులో ఒంపే ముందు బాగా కలపాలి.
ఈ పదార్థాలన్నిటినీ సాధ్యమైనంత చిన్న వయసులోనే తీసుకోవటం మొదలుపెట్టాలి. ఎముకలు పెరిగే క్రమంలో ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్ల వాటి సాంద్రత పెరుగుతుంది. అలాకాకుండా 40 ఏళ్ల వయసులో ఈ నియమాలు పాటించినా అప్పటికే ఎముకలు పూర్తి ఎదుగుదలకు చేరుకుని ఉంటాయి కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండదు.

వ్యాయామమే బలం
వ్యాయామం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందుకు వయసుతో పని లేదు. పిల్లలు, టీనేజర్లు, పెద్దలు, వృద్ధులూ అందరూ రోజుకు కనీసం గంటపాటైనా వయసుకి తగిన వ్యాయామం చేయాలి. మరీ ముఖ్యంగా స్త్రీలు ఎముకలను పటిష్ఠంగా ఉంచుకోవటం కోసం వెయిట్‌ ఎక్సర్‌సైజులు చేయాలి. నడవటం, జాగింగ్‌, స్కిప్పింగ్‌ మొదలైన వ్యాయామాలు చేయాలి. వృద్ధులు క్రమం తప్పకుండా నడుస్తూ ఉండాలి.

చికిత్సలూ ఉన్నాయి!
మహిళల్లో ఎముకలు గుల్లబారడానికి కారణాన్నిబట్టి తగిన చికిత్సతో పరిస్థితిని కొంతమేరకు సరిదిద్దవచ్చు.
యుక్త వయస్కుల్లో ఎముకల సాంద్రతను ఆహారం, క్యాల్షియం సప్లిమెంట్లతో సరిచేయవచ్చు.
ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గుదల వల్ల ఎముకలు గుల్లబారుతూ ఉంటే ‘హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ’(హెచ్‌ఆర్‌టీ)తో సమస్య చక్కదిద్దవచ్చు. ఈ చికిత్సతో సరిదిద్దలేని పరిస్థితి ఉంటే నోటి మాత్రల ద్వారా తగినంత క్యాల్షియంను అందించాల్సి ఉంటుంది.
కొంతమందిలో థైరాయిడ్‌ సమస్యలుంటాయి. కుషింగ్‌ సిండ్రోమ్‌ ఉంటుంది. ఈ సమస్యలు కూడా ఎముకల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ సమస్యలను సరిదిద్దాల్సి ఉంటుంది.
ఇంకొందరికి జీర్ణవ్యవస్థ సమస్యలుంటాయి. ఏం తిన్నా విరేచనం అయిపోవటం, పోషకాల శోషణ తగ్గిపోవటం వల్ల కూడా క్యాల్షియం శోషణ తగ్గి ఎముకలు బలహీనపడతాయి. ఈ సమస్యలను కూడా సకాలంలో గుర్తించి సరిచేయాలి.
ఎముకల సాంద్రత పరీక్షించుకోవాలి
ఎముకల సాంద్రత ఎంత? తీసుకుంటున్న క్యాల్షియం సరిపోతోందా? అనేది తెలుసుకోవటం కోసం క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకోసారి ఎముకల వైద్యుల్ని కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఎక్స్‌రే, బోన్‌ డెన్సిటీ టెస్ట్‌ పరీక్షలతో ఎముకల సాంద్రతను తెలుసుకుని క్యాల్షియం పరిమాణాన్ని సాధ్యమైనంతవరకూ ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలి.

క్యాల్షియమ్‌కి జోడీ విటమిన్‌ డి
మనం తీసుకునే కాల్షియమ్‌లో 10 నుంచి 15 శాతమే శరీరం శోషించుకుంటుంది. శరీర తత్వమే అంత! శరీరం క్యాల్షియమ్‌ను శోషించుకునే శక్తిని పెంచేది విటమిన్‌ డి. కాబట్టి క్యాల్షియం ఒక్కటే శరీరానికి అందిస్తే సరిపోదు. ఆహారంలోని క్యాల్షియమ్‌ను శరీరం చక్కగా శోషించుకోవాలంటే ‘విటమిన్‌ డి’ కూడా అంది తీరాలి. విటమిన్‌ డి ఎన్నో దశల్లో ప్రాసెస్‌ అవుతుంది. వీటిలో చివరి దశకు సూర్యరశ్మి అవసరం. కానీ ప్రస్తుత జీవనశైలిలో తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలట్లేదు. పిల్లలు పొద్దున్నుంచి, సాయంత్రం వరకూ బడుల్లో, ఆ తర్వాత ట్యూషన్లలో ఉండిపోవటం, టీనేజర్లు కాలేజీల్లో, హాస్టళ్లలో నీడ పట్టున ఉండిపోవటం వల్ల ఆ వయసులో అవసరానికి సరిపడా విటమిన్‌ డి శరీరంలో తయారు కాలేకపోతోంది. కాబట్టి ‘విటమిన్‌ డి’ పరిమాణాన్ని ఎప్పటికప్పుడు వైద్యుల సహాయంతో గుర్తిస్తూ సప్లిమెంట్ల రూపంలో భర్తీ చేస్తూ ఉండాలి.

స్త్రీలల్లో ఎముకల సమస్యలు
పూర్వంతో పోలిస్తే స్త్రీలల్లో ఎముకల సమస్యలు చాలా ముందుగానే మొదలవుతున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవేంటంటే….

మోకాళ్ల చిప్పల నొప్పులు: మోకాలి చిప్ప వెనక భాగంలో ఉండే మృదులాస్థి మెత్తబడటంతో మెట్లు ఎక్కి దిగేటప్పుడు, ఎక్కువ దూరం నడిచినప్పుడు నొప్పి మొదలవుతుంది. దీన్ని తిరిగి సరిచేసే వీలుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు, ఫిజియోథెరపీ, మందులతో మృదులాస్థి తిరిగి తయారై నొప్పి తగ్గిపోతుంది. కానీ ఎముకలు అరగటం ఒకసారి మొదలుపెడితే దాన్ని తిరిగి సరిచేసే పరిస్థితి ఉండదు. ఈ అరుగుదల వేగాన్ని తగ్గించవచ్చు కానీ పూర్తిగా ఆపలేము.
మడమ నొప్పి: ‘మడమ శూల’ అని కూడా ఈ నొప్పిని పిలుస్తారు. పాదంలోని మడమతో అనుసంధానమై ఉండే నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి మొదలవుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పాదాలకు సౌకర్యంగా ఉండే మెత్తని చెప్పులు వేసుకోవాలి. అలాగే నడిచేటప్పుడు శరీర భంగిమ సరిగా ఉండేలా చూసుకోవాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. అలాగే థైరాయిడ్‌ పరీక్ష చేయించుకుని హార్మోన్‌ హెచ్చుతగ్గులను సరిచేసుకోవాలి. అలాగే యూరిక్‌ యాసిడ్‌ పరిమాణాన్ని కూడా సరిచూసుకోవాలి.
వెన్ను నొప్పి: క్యాల్షియం, విటమిన్‌ డిలు ఎముకలకే కాదు కండరాల కదలికలకూ, సాగుదలకూ కీలకమే! వీటిలో లోపం వల్ల టెండనోపతీ, మయోపతీ, కండరాల నొప్పులు వేధిస్తాయి.
కండరాలు పట్టేయడం: పిక్కలు, కాలి కండరాలు పట్టేస్తుంటే విటమిన్‌ డి లోపంగా భావించాలి. ఇలాంటప్పుడు వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుని లోపాన్ని సరిదిద్దాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here