ఉస్మా‘నయా’ సేవలు

0
47

రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య చికిత్సలు
రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులు
రూ.13 కోట్ల వ్యయంతో అధునాతన యంత్రాల కొనుగోలు
అరుదైన శస్త్ర చికిత్సలకు కేరాఫ్‌గా ఉస్మానియా
రూ.5 కోట్ల నిధులతో సీటీ స్కాన్‌…

వివిధ ప్రమాదాల్లో గాయాలపాలైౖన క్షతగాత్రులకు, దీర్ఘకాలిక రోగులకు వెనువెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కీలకం సీటీ స్కాన్‌ యంత్రం. ఇది కులీకుతుబ్‌షా భవనంలో ఒక్కటే ఉంది. దీనిపై రోజూ 60 మందికి పైగా రోగులకు పరీక్షలు చేసే వారు. అధిక లోడు పడి నెలలో ఒకటి, రెండు సార్లు మూలనపడేది. రోగులను ఉస్మానియా నుంచి సీటీ స్కాన్‌ పరీక్షల కోసం ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేసేవారు. తాజాగా రూ. 5 కోట్ల వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సీటీ స్కాన్‌ యంత్రాన్ని కొనుగోలు చేసి ఓపీ భవనంలో ఏర్పాటు చేశారు.

(అఫ్జల్‌గంజ్‌): ఉస్మానియా ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతో రోగులకు సరికొత్త సేవలు అందుతున్నాయి. మొత్తం రూ. 50 కోట్ల నిధులను కేటాయించగా రూ. 13 కోట్ల వ్యయంతో అధికారులు అధునాతన యంత్రాలు, వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. నగరంతో పాటు తెలుగు రాష్ర్టాల్లోని పలు జిల్లాల నుంచి రోజూ ఉస్మానియా ఓపీ విభాగంలో 1500 మంది చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు ఇన్‌పేషెంట్‌ రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

25 వెంటిలేటర్ల ఏర్పాటు…
ఉస్మానియా ఆసుపత్రిలోని ఓపీ భవనం, కులీకుతుబ్‌షా భవనం, పాత భవనంలో ఉన్న పలు వార్డుల్లో గతంలో 60 వెంటిలేటర్ల ద్వారా రోగులకు వైద్య సేవలు అందించే వారు. వాటిలో 25 మూలనపడ్డాయి. దీంతో అత్యవసర సమయంలో వెంటిలేటర్లు లేక రోగులు ఇబ్బందులు పడేవారు. వీటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవడంతో పాటు ప్రత్యేక నిధులతో కొత్తగా 25 వెంటిలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఉస్మానియాలో వెంటిలేటర్ల సమస్యకు పరిష్కారం లభించనుంది.

మరో 15 డయాలసిస్‌ యంత్రాలు
కులీకుతుబ్‌షా భవనంలో ఉన్న నెఫ్రాలజీ విభాగంలో ప్రస్తుతం 15 డయాలసిస్‌ మిషన్ల ద్వారా రోగులకుసేవలు అందిస్తున్నారు. ఇప్పుడు నూతనంగా మరో 15 డయాలసిస్‌ మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఆయా కంపెనీల నుంచి ప్రతిపాదనలు అందాయి. త్వరలో వాటిని నెఫ్రాలజీ విభాగంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసి రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో డయాలసిస్‌ వైద్య చికిత్సలు అందించనున్నారు. త్వరలో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి.

బయో కెమిస్ర్టీ యంత్రాల ఏర్పాటు…
బయో కెమెస్ర్టీ యంత్రాల సమస్య వల్ల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయడంలో జాప్యం జరిగేది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఉస్మానియాకు రూ.50 కోట్లు కేటాయించడంతో ఆ నిధుల నుంచి రూ.1.6 కోట్ల వ్యయంతో రెండు అధునాతన బయో కెమిస్ర్టీ యంత్రాలను కొనుగోలు చేశారు. త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. దీంతో వ్యాధి నిర్దారణ పరీక్షలు మరింత వేగంగా అందించే వెసలుబాటు కలుగనుంది.

మౌలిక వసతుల కల్పన
ఆస్పత్రిలోని 22 విభాగాల్లో రోగులకు సరిపడా మౌలిక వసతులను దశల వారీగా ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల హెచ్‌ఓడీలతో ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, టీఎ్‌సఎంఐడీసీ చైర్మన్‌ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి టీఎ్‌సఎంఐడీసీకి అందించారు. దీని ప్రకారం స్ర్టెచర్లు, వీల్‌చైర్లను కొనుగోలు చేశారు. పేషెంట్‌ కేర్‌ సిబ్బందిని నియమించారు.

అధునాతన హంగులతో క్యాజువాల్టీ…
ఓపీ భవనంలో ఉన్న అత్యవసర విభాగం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. విభాగంలోని పైకప్పు, తరచూ కూలడం వల్ల రోగులకు, సిబ్బందికి ఇబ్బందులు తలెత్తేవి. దీనిపై స్పందించిన పాలకవర్గం క్యాజువాల్టీని కార్పొరేట్‌ స్థాయిలో ఆధునీకరించేందుకు సిద్ధమైంది.

మెరుగైన వైద్య సేవలు

ఉస్మానియాకు పేద రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్కడ నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. ఖరీదైన, అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కాలేయ మార్పిడి, ప్లాస్టిక్‌ సర్జరీ, కడుపులో వ్రణాల తొలగింపు, బేరియాట్రిక్‌ సర్జరీ తదితర అరుదైన శస్త్ర చికిత్సలు చేశాం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధులతో మేలు జరగనుంది.
– డాక్టర్‌. జీవీఎస్‌ మూర్తి, సూపరింటెండెంట్‌

ప్లాస్టిక్‌ సర్జరీలో నూతన పద్ధతులు
ప్లాస్టిక్‌ సర్జరీ.. ఎంతో ఖరీదైన వైద్యం.. ధనవంతులే చేయించుకోగల చికిత్స. అలాంటి వైద్యాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. ప్రమాదాల్లో అవయవాలను కోల్పోయి.. అంద విహీనంగా తయారైన వారికి మళ్లీ రూపం ప్రసాదిస్తున్నారు వైద్యులు. ముక్కు, చెవి, పెదాలు, బుగ్గలు, కంటి నొసలు, రెప్పలు లాంటి అవయవాలను అమర్చి రోగుల్లో మనోధైౖర్యాన్ని నింపుతున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ డాక్టర్‌. నాగప్రసాద్‌ వైద్య బృందం సర్జరీల్లో రికార్డులను నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్‌. నాగప్రసాద్‌తో ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఆంధ్రజ్యోతి: : ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ఎన్ని యూనిట్లతో రోగులకు సేవలు అందిస్తున్నారు?

డాక్టర్‌ : ఉస్మానియా ఆస్పత్రికి వివిధ ప్రమాదాల బారినపడి వచ్చే రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలను రెండు యూనిట్ల ద్వారా అందిస్తున్నాం. హెచ్‌ఓడీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఒక ఎస్‌ఆర్‌-1, 21 మంది పీజీలు రోస్టర్‌ పద్ధతిలో 24 గంటలూ సేవలు అందిస్తున్నాం.

ఖరీదైన వైద్యం.. ఉస్మానియాలో ఉచితంగా… – డాక్టర్‌ నాగప్రసాద్‌

ఆంధ్రజ్యోతి: రోజూ ఓపీ ఎంత ఉంటుంది? ఎన్ని శస్త్ర చికిత్సలు చేస్తారు?
డాక్టర్‌ : ఈ విభాగంలో రోజూ ఓపీ కొనసాగుతుంది. ఆదివారం, గాంధీ జయంతి, స్వాతంత్య్ర వేడుకలు, రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ఓపీ సేవలకు సెలవులు ఉంటాయి. మిగతా రోజుల్లో రోగులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోజు విద్యుత్‌షాక్‌, రోడ్డు ప్రమాదాలు, కాలిన గాయాలతో 30 నుంచి 35 మంది రోగులు వస్తుంటారు. 10 నుంచి 15 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి: ప్రస్తుతం ఏం మార్పులు చోటుచేసుకున్నాయి?
డాక్టర్‌ : ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం గతంలో కంటే ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందింది. అప్పట్లో సైనోకామాస్టియా ఓపెన్‌ పద్ధతిలో (మగవారిలో ఉన్న కొవ్వును తొలగించడం) ఉండేది. ప్రస్తుతం లైపోసెక్షన్‌ ద్వారా కొవ్వును కరిగించి తొలగిస్తున్నాం. ముఖంలో ఒక పక్క గుంతలు, సొట్టలుగా ఉన్న భాగాన్ని ఫ్యాట్‌ ఫిల్లింగ్‌ ద్వారా సరిచేస్తున్నాం. దీన్ని వైద్య పరిభాషలో ఫేస్‌లిఫ్ట్‌ విధానం అంటారు.

ఆంధ్రజ్యోతి : ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం హెచ్‌ఓడీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మూడేళ్లలో ఎన్ని అరుదైన సర్జరీలు నిర్వహించారు?
డాక్టర్‌ : తాను పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వందలాది సర్జరీలు నిర్వహించాం. అందులో ముఖ్యంగా ముఖం భాగం పూర్తిగా పాడవ్వడం, చెవులు తెగిపోవడం, ముక్కు తెగిపోవడం వంటి వారికి శరీరంలో ఇతర భాగాల్లో ఉన్న మాంసాన్ని తొలగించి వాటిని తెగిపోయిన స్థానాల్లో లైపో సర్జరీ ద్వారా సరి చేశాం. అంధవికారంగా ఉన్న శరీర భాగాలను సాధారణ రూపంలోకి తీసుకువచ్చాం.

ఆంధ్రజ్యోతి: రోగులకు అందిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
డాక్టర్‌ : వివిధ ప్రమాదాలలో కాలిన గాయాలు, రోడ్డు ప్రమాదాలకు గురై వచ్చిన క్షతగాత్రులకు వెంటనే ఆస్పత్రిలోని ఏబీసీ వార్డులో చేర్పించుకుంటున్నాం. ముఖ్యంగా విద్యుత్‌షాక్‌కు గురైనవారికి మొదట అతని ప్రాణాలు కాపాడేందుకు హైఫ్లూయడ్స్‌ ఇవ్వడంతో పాటు మానిటరింగ్‌ పద్ధ్దతిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగం వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నాం. 20 నుంచి 50 శాతం కాలినగాయాలతో ఉన్న క్షతగాత్రులను ఏబీసీ వార్డులో చేర్పించుకుని వారిలో రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు ఖరీదైన అల్బుమిన్‌ ఇంజక్షన్లను ఇస్తున్నాం.

ఆంధ్రజ్యోతి: కాలిన గాయాలకు గురైన చిన్నారులకు ఈ విభాగంలో ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
డాక్టర్‌ : వివిధ ప్రమాదాల్లో గాయాలపాలైన చిన్నారులకు ఆస్పత్రిలోని పీడియాట్రిక్‌ విభాగంలో చేర్పిస్తున్నాం. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో పాటు వారికి శరీరంలో ఏ భాగం పాడైపోయిందో గుర్తించి వెంటనే లైపోసర్జరీ ద్వారా కొత్త రూపాన్ని ఇస్తున్నాం.

ఆంధ్రజ్యోతి: రోగులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
డాక్టర్‌ : వివిధ ప్రమాదాల్లో గాయాలకు గురైన వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉస్మానియాలోని తమ విభాగంలో నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. నయాపైసా ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. గతంలో కంటే ప్రస్తుతం ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో మెరుగైన వసతులు ఉన్నాయి. రోగులకు సరిపడా పడకలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉన్నారు.

ఆంధ్రజ్యోతి: వైద్యం ఉచితమేనా..?
డాక్టర్‌ : 20 శాతం కాలిన గాయాలకు గురైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు రూ.10లక్షలు వసూలు చేస్తారు. 50 శాతం కాలిపోయిన వారికి రూ. 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఉస్మానియా ఆస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందిస్తున్నాం. ఖరీదైన మందులను ఇస్తున్నాం. రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి వెళ్లే ముందు బస్‌ చార్జీలు, మూడు నెలలకు అవసరమైన మందులు ఉచితంగా అందిస్తున్నాం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here