ఎవరు ఫేవరెట్‌..?

0
53

రేపటి నుంచే ఫిఫా
అండర్‌-17 వరల్డ్‌ కప్‌
వరల్డ్‌ కప్‌ అంటేనే పటిష్ఠ జట్లు.. ప్రతిభావంతులైన ఆటగాళ్లు.. హోరాహోరీ సమరాలు ఖాయం..! అందునా ఫుట్‌బాల్‌ అంటే పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంది..! కుర్రాళ్ల టోర్నీయే అయినా… రేపటి నుంచి జరిగే ఫిఫా అండర్‌-17 ప్రపంచ కప్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి..! అయితే.. 24 జట్లు బరిలో నిలిచినా.. కప్పు కొట్టే బలం మాత్రం కొన్నింటికే ఉంటుంది..! మరి, ఈ మెగా ఈవెంట్‌లో కప్పు రేసులో నిలిచిన జట్లేవో చూద్దాం..!
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఫిఫా టోర్నీ ఏదైనా యూరోపియన్‌ అగ్ర జట్లు స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మ నీ ఎప్పుడూ ముందంజలో ఉంటాయి. అయితే, గత ఆరు అంచెల్లో ఒకేసారి యూరోపియన్‌ జట్టు చాంపియన్‌గా ఆవిర్భవించింది. 2009లో స్విట్జర్లాండ్‌ టైటిల్‌ కొల్లగొట్టింది. ఇదే సమయంలో స్పెయిన్‌ రెండు సార్లు రన్నరప్‌గా నిలవగా.. జర్మనీ రెండు సార్లు మూడో స్థానం సాధించింది. కానీ, 2001లో ట్రోఫీ నెగ్గిన తర్వాత ఫ్రాన్స్‌ ఒక్కసారి కూడా టాప్‌-4లోకి రాలేకపోవడం గమనార్హం. బ్రెజిల్‌ ఏ స్థాయిలో అయినా గట్టి జట్టే. మూడుసార్లు (1997, 99, 2003) విజేతగా నిలిచిన ఆ జట్టు చివరగా 2005లో ఫైనల్‌కు చేరుకుంది. ఈ మధ్య కాలంలో బ్రెజిల్‌ జట్టు గొప్పగా ఆడడం లేదు. అయినా.. మెరికల్లాంటి ఆటగాళ్లు ఉన్న ఆ జట్టును ఓడించడం అంత సులభం కాబోదు. నైజీరియా గత ఐదు వరల్డ్‌కప్‌ల్లో మూడు సార్లు విజేతగా నిలిచింది. కానీ, అర్హత పోటీల సందర్భంగా ఆటగాళ్ల వయసు ధ్రువీకరణల్లో మోసానికి పాల్పడడంతో ఆ జట్టు ఈ సారి క్వాలిఫై కాలేకపోయింది. దాంతో, మిగతా జట్లకు మార్గం సుగమం అయింది. ఇక, మెక్సికో గత మూడు అంచెల్లో రెండు సార్లు ఫైనల్‌కు చేరుకొంది. ఒకసారి విజేతగా నిలిచింది. 2015లో నాలుగో స్థానం సాధించింది. కానీ, బ్రెజిల్‌ మాదిరిగా మెక్సికో ప్లేయర్లు సీనియర్‌ ఫుట్‌బాల్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. లేదంటే.. యూరోపియన్‌ లీగ్‌లో ఆ జట్టు టాప్‌లో ఉండేదే. ఇంగ్లండ్‌ మేటి జట్లలో ఒకటే. అయితే, ఆ జట్టు ఇప్పటిదాకా సెమీఫైనల్‌కు కూడా చేరలేదు. అమెరికా కూడా ఎప్పుడో 1999లో చివరగా టాప్‌-4లో నిలిచింది. అయినా.. ఆ జట్టుపై కూడా అంచనాలు ఉన్నాయి.

వీళ్ల ఆటను చూద్దాం..
టోనీ క్రూస్‌, లాండన్‌ డొనొవాన్‌, సెస్క్‌ ఫాబ్రిగాస్‌ అండర్‌-17 వరల్డ్‌కప్‌లో ఉత్తమ ప్లేయర్స్‌గా గోల్డెన్‌ బాల్‌ నెగ్గిన ఆటగాళ్లు. భావి చాంపియన్లను అందించే ఈ టోర్నీలో వీరి మాదిరిగానే ఈ సారి కూడా గోల్డెన్‌ బాల్‌ రేసులో పలువురు వర్థమాన ప్లేయర్లు ఉన్నారు. ఇంగ్లండ్‌ జట్టు.. తమ మిడ్‌ ఫీల్డర్లు ఏంజెల్‌ గోమ్స్‌, జడాన్‌ సాంచోపై భారీ అంచనాలు పెట్టుకుంది. గోమ్స్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరఫున ఇప్పటికే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అమెరికా జట్టులో అయో అకినొలా, జోష్‌ సార్గెంట్‌ ఎంతటి ప్రత్యర్థి జట్టుపైనైనా గోల్‌ కొట్టగల సమర్థులు. ఇక, రియల్‌ మాడ్రిడ్‌ వర్థమాన స్టార్‌ వినిసియస్‌ జూనియర్‌ను బ్రెజిల్‌ ఈ టోర్నీలో మిస్సవుతోంది. తన క్లబ్‌తో ఒప్పందం కారణంగా అతను ఈ టోర్నీలో బరిలోకి దిగడం లేదు. అయినా.. వినిసియస్‌ సహచర ఫార్వర్డ్‌ ఆటగాడు పాలిన్హో బ్రెజిల్‌ జట్టులో భరోసా నింపుతున్నాడు. పదిహేడేళ్ల వయసులోనే బార్సిలోనా-బి జట్టు గడపతొక్కిన అబెల్‌ రుయిజ్‌ స్పెయిన్‌కు అదృష్టం తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here