ఎస్.జె. సూర్య మరో మంట రాజేశాడు

0
46

జయలలిత మరణానంతరం తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న నాయకులు అధికారం కోసం తర్జనభర్జనలు పడుతుంటే, కేంద్రం కూడా తమిళనాడుపై ఓ కన్నేసి ఉంచింది. మరోవైపు రజినీకాంత్ రాజకీయాల గురించి మీనమేషాలు లెక్కపెడుతుంటే, కమల్ హాసన్ మాత్రం కొత్త పార్టీ అంటూ కుండబద్దలు కొట్టేశాడు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడు.

రజినీ, కమల్‌లే కాకుండా మరో హీరో పేరు ముఖ్యమంత్రిగా తెరపైకి వస్తోంది. మొదటి నుండి అనుకున్నట్లుగానే ఇళయదళపతి విజయ్ కూడా తమిళ రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తిగా పేరు వినబడుతూనే ఉంది. అయితే ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హైలైట్ అవుతోంది. దీనికి కారణం ఇటీవల వచ్చిన ‘స్పైడర్’ చిత్రంలో విలన్‌గా నటించిన ఎస్.జె. సూర్య కావడం విశేషం.

విజయ్ ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తానని, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఇప్పుడున్న పరిస్థితులకు కరెక్ట్ అని చెప్పడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశం అయ్యింది. విజయ్ ఆలోచనలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. తమిళనాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయితే బావుంటుందని సూర్య తన అభిప్రాయాన్ని తెలిపాడు. విజయ్ హీరోగా నటించిన ‘మెర్సల్’ చిత్రంలో విలన్‌గా నటించిన సూర్య, ఆ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే తమిళనాడులో ఇద్దరు స్టార్ హీరోలు ఏం చేయాలా, ఎలా చేయాలా అని రాజకీయాల విషయంలో ఆలోచిస్తుంటే కొత్తగా సూర్య ఇప్పుడు విజయ్ పేరుని తీసుకురావడం కోలీవుడ్‌లో కొత్త మంట రాజేసినట్లవుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here