ఐఏఎస్‌ కుమార్తె పెళ్లి ఖర్చు రూ.16 వేలు

0
130

వుడా వీసీ బసంత్‌ కుమార్‌ తనయ ఆదర్శ వివాహం
విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పెళ్లి కోసం సామాన్య ప్రజలే భారీగా ఖర్చు చేస్తున్న రోజులువి. అలాంటిది ఓ ఐఏఎస్‌ అధికారి ఏకైక కుమార్తె వివాహం అంటే ఎంత ధూమ్‌ధామ్‌గా జరుగుతుందో చెప్పలేం. కానీ విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ వీసీగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి పట్నాల బసంత్‌ కుమార్‌ మాత్రం తన కుమార్తె పెళ్లికి చేసిన ఖర్చు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం రూ.16,100తో ఆయన తన కుమార్తె పెళ్లి కార్యక్రమాన్ని ముగించారు. బసంత్‌ కుమార్‌ గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ కార్యదర్శిగా పనిచేశారు. దీంతో ఈ వివాహానికి గవర్నర్‌ దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బసంతకుమార్‌ రాధాస్వామి సత్సంగ్‌ సభ్యులు. తన కుమార్తె బినతి వరిశా వివాహాన్ని ఆదర్శప్రాయంగా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

మనసులో మాటను కుమార్తె, ఇతర కుటుంబసభ్యులకు చెప్పారు. బీడీఎస్‌ పూర్తి చేసిన వరిశా తండ్రి మాటను గౌరవించి, సాదాసీదాగా పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఏఎండీ కంపెనీలో చీఫ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న ప్రేమ స్వరూ్‌పతో వరిశా వివాహం చేసేందుకు బసంత్‌ కుమార్‌ నిర్ణయించారు. సెప్టెంబరు 17న ఆగ్రాలోని రాధాస్వామి సత్సంగ్‌లో వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వంద మందికి భోజనాలు, పెళ్లికుమార్తెకు చీర(రూ.4500), మంగళసూత్రం(రూ.6వేలు), పెళ్లికుమారునికి కుర్తా, సూట్‌(రూ.4900) వీటి కోసం రూ.16,100 ఖర్చు చేశారు. వివాహం జరుగుతున్న తీరు చూసి పెళ్లి కుమార్తె…‘ఆదర్శ వివాహం అంటే మరీ ఇంత సింపుల్‌గానా నాన్న’ అని అడిగింది. దీనికి బసంత్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘గవర్నర్‌, లేడీ గవర్నర్‌ స్వయంగా వచ్చి ఆశీర్వదించారంటే నీ పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిగినట్టు?’ అంటూ జవాబిచ్చారు.