టీ-20 మ్యాచ్‌కు వరద కష్టాలు

0
119

ఇప్పటికే బురద మయంగా స్టేడియం చేరే రోడ్లు
ఈ రోజు గట్టిగా వర్షం కొడితే ప్రయాణం మరీ కష్టం
వేల వాహనాలు తరలివచ్చే రోడ్లు ఇవి
ఉన్నది ఒక పార్కింగ్‌ స్థలం
దీనిని చేరాలంటే రెండు రోడ్లు
ఈ మధ్యనే తవ్వి మట్టితో పూడ్చారు
కొంచెం వాన వచ్చినా బురద..బురదే
గుంతల్లో మట్టిపోసి చదును చేసిన ట్రాఫిక్‌ పోలీసులు
ఉప్పల్‌/హైదరాబాద్: భారత్‌- ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ను ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికి అందుకు తగ్గ ఏర్పాట్లు జరగలేదు. మ్యాచ్‌ కోసం స్టేడియంలోకి సుమారు 30 వేల మంది వస్తారు. వేలాది వాహనాలు ఆ పరిసరాల్లో పార్కింగ్‌ చేస్తారు. అక్కడ ఖాళీగా ఉన్న ఏకైక స్థలం పెంగ్విన్‌ టెక్స్‌టైల్స్‌కు చెందింది. ఈ స్థలంలో మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే వారి వాహనాల్లో అక్కడ 25 శాతం కూడా పార్కింగ్‌ చేసేందుకు సరిపోదు. ఆ స్థలంలోకి వెళ్ళేందుకు రెండు రోడ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏక్‌మినార్‌, మరొకటి జెన్‌పాక్ట్‌. ఈ రోడ్లను ఇటీవల జలమండలి పైప్‌లైన్ల నిర్మాణం కోసం తవ్వి మట్టితో పూడ్చింది. కానీ సీసీ రోడ్డు వేయలేదు. దీంతో ఈ రోడ్లు అధ్వానంగా మారాయి. మరో సారి వర్షం పడితే క్రీడాభిమానులకు ఆ దారిపై ప్రయాణం నరకమే. స్టేడియం చుట్టూ ఉన్న 11 ప్రధాన గేట్ల ద్వారా లోనికి వెళ్లాలంటే ఈ బురద రోడ్డే ఆధారం. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఇది మరింత బుదర మయంగా మారింది.

ఎక్స్‌కవేటర్‌ చదును
హెచ్‌సీఏ అధికారులు స్పందించకపోయినా ట్రాఫిక్‌ స్తంభించకుండా ఉండేందుకు ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఎక్స్‌కవేటర్‌తో రహదారులపై ఏర్పడ్డ గుంతల్లో మట్టి పోసి చదును చేయించారు. స్టేడియానికి వెళ్ళే దారులకు తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు.

స్టేడియం ముందు మురుగు పరుగు….
అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ జరిగే స్టేడియం గేటునెంబర్‌-1 ముందు డ్రైనేజీ నీరు పొంగుతోంది. కొన్ని నెలలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అటు పారిశ్రామిక వాడ అధికారులు, ఇటు హెచ్‌సీఏ ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గురువారం స్టేడియం వద్దకు వచ్చిన కొందరు క్రీడాభిమానులు ఇక్కడి దుర్భరమైన పరిస్థితులు చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిక్కెట్ల కోసం తంటాలు..
అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ కావడంతో పాటు హైదరాబాద్‌లో కేవలం ఒకటే మ్యాచ్‌ ఉండడంతో టికెట్ల కోసం యువత చక్కర్లు కొడుతోంది. గురువారం ఇక్కడకు చాలా మంది టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు.