తిరుపతమ్మ చిన్న తిరునాళ్ళు

0
221
ఏడాదికి రెండు తిరునాళ్ళు నిర్వహించే అరుదైన దేవాలయాల్లో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ ఆలయం ఒకటి. పదిహేడవ శతాబ్దంలో ఆ ప్రాంతంలో జీవించిన తిరుపతమ్మ మహిమల గురించి ఇక్కడి వారు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. తిరుపతమ్మ, ఆమె భర్త గోపయ్య విగ్రహాలు కొలువుతీరిన ఈ ఆలయాన్ని సందర్శించి, పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళు ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి నాడు మొదలై అయిదురోజులు జరుగుతాయి. చిన్న తిరునాళ్ళను ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నుంచి అయిదు రోజులు నిర్వహిస్తారు. ఇవి రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం అవుతాయి.
ఎప్పుడు?: మార్చి రెండో తేదీ నుంచి మార్చి ఆరో తేదీ వరకూ
ఎక్కడ?: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో
ఎలా వెళ్ళాలి?: విజయవాడకు 72, గుంటూరుకు సుమారు 103 కిలోమీటర్లు, జగ్గయ్యపేటకు 25 కిలోమీటర్ల దూరంలో పెనుగంచిప్రోలు ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి జగ్గయ్యపేటకు, అక్కడి నుంచి పెనుగంచిప్రోలుకు చేరుకోవచ్చు. సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ విజయవాడ. దగ్గర్లోని విమానాశ్రయం కూడా విజయవాడ (గన్నవరం)లోనే ఉంది.
ఉత్సవ వివరాలు:
మార్చి 2- అఖండ జ్యోతి స్థాపన, నిత్య కల్యాణమూర్తులకు అభిషేకం, సామూహిక కుంకుమార్చన
మార్చి 3- తిరుపతమ్మ పుట్టింటి వంశం వారి ఇళ్ళ నుంచి పసుపు, కుంకుమ బండ్ల ఉత్సవం
మార్చి 4- రథోత్సవం (గ్రామోత్సవం)
మార్చి 5- దివ్య ప్రభోత్సవం (ప్రాకార ఉత్సవం)
మార్చి 6- బోనాలు, మొక్కుబడుల సమర్పణ