తేలేది భాగ్యనగరిలోనే

0
122

రెండో టీ-20లో భారత్‌ చిత్తు
చెలరేగిన బెరెండార్ఫ్‌
8 వికెట్లతో ఆసీస్‌ విజయం
13న హైదరాబాద్‌లో చివరి మ్యాచ్‌
8, 2, 0, 6 గువాహటిలో భారత టాప్‌-4 బ్యాట్స్‌మెన్‌ స్కోర్లు ఇవి..! కెరీర్‌లో రెండో టీ-20 ఆడుతున్న ఆస్ట్రేలియా పేసర్‌ బెరెండార్ఫ్‌ (4-0-21-4) ధాటికి.. టీమిండియా ఎలా విలవిల్లాడిందో చెప్పేందుకు ఈ అంకెలే నిదర్శనం..! టన్నుల కొద్దీ పరుగులు బాదేసి… భీకరమైన ఫామ్‌లో ఉన్న రోహిత్‌, కోహ్లీ, ధవన్‌తో పాటు మనీష్‌ పాండే అతని దెబ్బకు బిత్తరపోయాడు..! కుర్ర స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా (4-0-19-2) కూడా బంతిని గిరగిరా తిప్పేయడంతో గువాహటిలో కోహ్లీసేన కుప్పకూలింది..! వంద పరుగులు చేసేందుకే ఆపసోపాలు పడింది..! చావోరేవో మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగి ఆతిథ్య జట్టును కట్టడి చేసిన చోట.. హెన్రిక్స్‌, హెడ్‌ భారీ షాట్లతో విజృంభించడంతో రెండో టీ-20లో ఆసీస్‌ ఘన విజయం సాధించింది..! దాంతో, మూడు టీ-20ల సిరీస్‌ 1-1తో సమం చేసింది..! ఇక, సిరీస్‌ ఫలితం తేలేది భాగ్యనగరంలోనే..!

గువాహటి: భారత్‌కు షాక్‌. ఆస్ట్రేలియాపై వరుసగా ఏడు టీ-20ల విజయ యాత్రకు బ్రేక్‌. గువాహటిలోనే సిరీస్‌ను పట్టేయాలని ఆశించిన కోహ్లీసేనకు భంగపాటు ఎదురైంది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో టీ-20లో ఆసీస్‌ ఎనిమిది వికెట్లతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ప్రత్యర్థి బౌలింగ్‌ ధాటికి 20 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. కేదార్‌ జాదవ్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 27), హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 1 సిక్సర్‌తో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జట్టులో కేవలం నలుగురే రెండంకెల స్కోరు చేశారు. ఆడమ్‌ జంపా (2/19) కూడా భారత్‌ను దెబ్బకొట్టాడు. అనంతరం 119పరుగుల లక్ష్యాన్ని మోసీ హెన్రిక్స్‌ (46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 నాటౌట్‌), ట్రావిస్‌ హెడ్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 48 నాటౌట్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఆస్ట్రేలియా మరో 27 బంతులు మిగిలుండగానే రెండే వికెట్లు కోల్పోయి అలవోకగా చేరుకుంది. ఆరంభంలోనే డేవిడ్‌ వార్నర్‌ (2)ను బుమ్రా, ఆరోన్‌ ఫించ్‌ (8)ను భువనేశ్వర్‌ అవుట్‌ చేయడంతో ఆతిథ్య జట్టులో ఆశలు రేగాయి. భువీ (3-0-9-1) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 5 ఓవర్లకు ఆసీస్‌ 25/2తో నిలిచింది. కానీ, అతని స్పెల్‌ ముగిశాక హెన్రిక్స్‌, హెడ్‌ భారీ షాట్లతో విజృంభించారు. మూడో వికెట్‌కు అజేయంగా 115 జోడించి ఆసీస్‌ను గెలిపించారు. బెరెండార్ఫ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈనెల 13న హైదరాబాద్‌లో చివరి మ్యాచ్‌ జరగనుంది.

బెరెండార్ఫ్‌ దెబ్బకు బెంబేలు
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఆసీస్‌ పేసర్‌ జాసన్‌ బెరెండార్ఫ్‌ బెంబేలెత్తించాడు. రాంచీలో టీ-20లో అరంగేట్రం చేసిన ఈ 27 ఏళ్ల పేసర్‌ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. బంతిని రెండు వైపుల స్వింగ్‌ చేసిన అతను.. ఆతిథ్య టాపార్డర్‌ను కకావికలు చేసేశాడు. తొలి ఓవర్లోనే రోహిత్‌ శర్మ (8), విరాట్‌ కోహ్లీ (0)ను అవుట్‌ చేసి భారత్‌కు షాకిచ్చిన జాసన్‌.. శిఖర్‌ ధవన్‌ (2), మనీష్‌ పాండే (6)ను కూడా బుట్టలో వేసుకున్నాడు. దాంతో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా. కేదార్‌, హార్దిక్‌ పోరాడకుంటే స్కోరు వంద కూడా దాటేది కాదు. వాస్తవానికి అంతర్జాతీయ మ్యాచ్‌కు తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన వేదికపై.. ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో బెరెండార్ఫ్‌ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్‌ మెరుపు ఆరంభమే ఇచ్చాడు. భారత బ్యాట్స్‌మెన్‌ అంతా ఫామ్‌లో ఉండడంతో అభిమానులు భారీ స్కోరును ఆశించారు. కానీ, ఆ ఆశలను ఆదిలోనే చిదిమేశాడు బెరెండార్ఫ్‌. తర్వాతి బంతికే అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో రోహిత్‌ను ఎల్బీ చేసిన ఆసీస్‌ పేసర్‌.. రెండు బంతుల అనంతరం కోహ్లీని రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారింది. తన తర్వాతి ఓవర్లోనే బెరెండార్ఫ్‌ మరో స్వింగ్‌ బాల్‌తో మనీష్‌ పాండేను కీపర్‌ క్యాచ్‌ ద్వారా వెనక్కిపంపాడు. ఆపై అతని బౌలింగ్‌లోనే డేవిడ్‌ వార్నర్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు ధవన్‌ కూడా అవుటవడంతో భారత శిబిరంలో నిస్తేజం ఆవహించింది. ఈ దశలో కేదార్‌, ధోనీ (13) ఐదో వికెట్‌కు 33 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఆసీస్‌ వదిలితే కదా! ఈ సారి స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో ధోనీ, కేదార్‌ను అవుట్‌ చేయడంతో కోహ్లీసేన 70/7తో బిత్తరచూపులు చూసింది. కుల్దీప్‌ యాదవ్‌ (16) సాయంతో హార్దిక్‌ పాండ్యా ఒక్కో పరుగు చేర్చసాగాడు. ఆండ్రూ టై బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. స్కోరు 100 దాటించిన తర్వాత అతను అవుటయ్యాడు. చివరి మూడు ఓవర్లలో 17 పరుగులు చేసిన భారత్‌ ఆఖరి బంతికి ఆలౌటైంది.

స్కోరుబోర్డు
భారత్‌: రోహిత్‌ (ఎల్బీ) బెరెండార్ఫ్‌ 8, ధవన్‌ (సి) వార్నర్‌ (బి) బెరెండార్ఫ్‌ 2, కోహ్లీ (సి అండ్‌ బి) బెరెండార్ఫ్‌ 0, మనీష్‌ (సి) పెయిన్‌ (బి) బెరెండార్ఫ్‌ 6, కేదార్‌ (బి) జంపా 27, ధోనీ (స్టంప్డ్‌) పెయిన్‌ (బి) జంపా 13, హార్దిక్‌ (సి) సబ్‌/క్రిస్టియన్‌ (బి) స్టొయినిస్‌ 25, భువనేశ్వర్‌ (సి) హెన్రిక్స్‌ (బి) కల్టర్‌నైల్‌ 1, కుల్దీప్‌ (సి) పెయిన్‌ (బి) ఆండ్రూ టై 16, బుమ్రా (రనౌట్‌) 7, చాహల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 118 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-8, 2-8, 3-16, 4-27, 5-60, 6-67, 7-70, 8-103, 9-115; బౌలింగ్‌: బెరెండార్ఫ్‌ 4-0-21-4, కల్టర్‌నైల్‌ 4-0-23-1, జంపా 4-0-19-2, టై 4-0-30-1, స్టొయినిస్‌ 4-0-20-1.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్‌ 8, వార్నర్‌ (సి) కోహ్లీ (బి) బుమ్రా 2, హెన్రిక్స్‌ (నాటౌట్‌) 62, హెడ్‌ (నాటౌట్‌) 48; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 15.3 ఓవర్లలో 122/2; వికెట్ల పతనం: 1-11, 2-13; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-9-1, బుమ్రా 3-0-25-1, హార్దిక్‌ 2-0-13-0, కుల్దీప్‌ 4-0-46-0, చాహల్‌ 3.3-0-29-0.