త్వరలో వ్యవసాయ ఎగుమతుల విధానం

0
89

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, భారత వ్యవసాయదారులకు అంతర్జాతీయ మార్కెట్లు అందుబాటులోకి తేవడం తన ప్రాధాన్యతలని వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేశ్‌ ప్రభు చెప్పారు. భారత రైతులు ప్రపంచ మార్కెట్లకు చేరేందుకు, తమ ఉత్పత్తులకు మరింత మెరుగైన ధరలు పొందేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నారని ఆయన అన్నారు.

అందుకు అనుకూలించే విధానం ఒకటి రూపొందించబోతున్నట్టు ఆయన చెప్పారు. వ్యవసాయ రంగానికి అంతర్జాతీయ సరఫరాల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మంగళవారం ఇక్కడ 10వ వ్యవసాయ లీడర్‌షిప్‌ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభు హామీ ఇచ్చారు. వ్యవసాయదారులు అంతర్జాతీయ మార్కెట్లను చేరాలంటే వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్న అన్ని రకాల అవరోధాలు తొలగించాల్సి ఉన్నదన్నారు. తాము ప్రతిపాదిస్తున్న చర్యల వల్ల వ్యవసాయదారుల ఆదాయాలు పెరుగుతాయంటూ 2022 నాటికి వ్యవసాయదారుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. భిన్న పంటలు పెంచడం, అనుబంధ రంగాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై దృష్టి కేంద్రీకరించడం, అంతర్జాతీయ మార్కెట్లకు చేరడం తమ పరిశీలనలో ఉన్న అంశాలని ప్రభు అన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక విభాగం గణాంకాల ప్రకారం పళ్లు, కూరగాయలు, ప్రాసె స్డ్‌ ఆహార ఉత్పత్తులు, పశు ఉత్పత్తుల ఎగుమతులు 2016-17లో 1,627 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. దేశీయంగా కూడా తాము ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయంతో వ్యవసాయ పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.
దేశంలో పారిశ్రామిక క్లస్టర్లున్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రం అలాంటివి ఎందుకుండకూడదని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే మనీలా, సియోల్‌లలో జరుగనున్న వాణిజ్య మంత్రుల సమావేశాల్లో తాను పాల్గొంటానని, డిసెంబరులో డబ్ల్యుటిఓ మంత్రుల స్థాయి సమావేశంలో కూడా పాల్గొంటానని ఆయన చెప్పారు. భారత వ్యవసాయదారులకు అంతర్జాతీయ మార్కెట్లు అందుబాటులోకి తేవడం కోసం చర్చలు జరపడమే ఆ సమావేశాల్లో తన అజెండా అని సురేశ్‌ ప్రభు అన్నారు.