పుణెలో పెను సవాల్‌

0
47

కోహ్లీసేనకు అగ్ని పరీక్ష
గెలిస్తేనే సిరీస్‌లో నిలిచేది
ఒత్తిడంతా భారత్‌పైనే
సిరీస్‌పై కివీస్‌ గురి
రెండో వన్డే నేడు
అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపించి.. భారీ అంచనాల మధ్య ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు వాంఖడేలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి ఓటమిని మూట కట్టుకున్నది. దాంతో, వరుసగా ఏడో సిరీస్‌పై గురిపెట్టిన భారత్‌ ఇప్పుడు సొంతగడ్డపై కివీస్‌కు తొలిసారి సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ముంగిట నిలిచింది. దాన్ని తప్పించుకోవాలంటే.. కోహ్లీసేన వెంటనే పుంజుకోవాల్సిందే..! సిరీస్‌లో నిలవాలంటే రెండో వన్డేలో నెగ్గి తీరాల్సిందే..! దాంతో, ఇప్పుడు ఒత్తిడంతా ఆతిథ్య జట్టుపైనే.! మరోవైపు తొలి వన్డేలో అద్భుత విజయంతో కివీస్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది..! అదే జోరుతో మరో మ్యాచ్‌లో నెగ్గి భారత గడ్డపై తొలిసారి సిరీస్‌ నెగ్గాలని ఆ జట్టు ఆరాటపడుతోంది..! ఈ నేపథ్యంలో నేడు పుణెలో జరిగే రెండో వన్డే సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది..!
పుణె: సొంతగడ్డపై టీమిండియాకు అగ్ని పరీక్ష. ఈ మధ్య కాలంలో ఎప్పు డూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటూ చా వోరేవో పోరుకు సిద్ధమైంది కోహ్లీసేన. తొలి వన్డేలో ప్రతికూల ఫలితంతో షాక్‌ కు గురైన భారత్‌ బుధవారం ఇక్కడ జరిగే రెండో వన్డేలో న్యూజిలాండ్‌తో చావో రేవో తేల్చుకోనుంది. వాస్తవానికి స్వదేశంలో భారత్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురవడం చాలా అరుదు. పైగా, వర ల్డ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి వరుసగా ఆరో సిరీ స్‌ నెగ్గిన భారత్‌కు కివీలు ఇలా తొలి పోరులోనే ముకుతాడు వేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ, చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత బరిలోకి దిగిన తమ తొలి వన్డేలోనే బ్లాక్‌క్యాప్స్‌ టీమ్‌ ఆతిథ్య జట్టు మైండ్‌ బ్లాంక్‌ చేసింది. వెటరన్‌ స్టార్‌ రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌ 200 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో వాంఖడేలో నెగ్గిన కివీస్‌ ఇప్పుడు భారత గడ్డపై సిరీస్‌ను కైవసం చేసుకునే అరుదైన అవకాశం ముంగిట నిలిచింది.

ఆస్ట్రేలియన్లను సిరీస్‌ ఆసాంతం ముప్పుతిప్పలు పెట్టించిన స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ను కివీస్‌ ద్వయం లాథమ్‌-టేలర్‌ ఎదుర్కొన్నతీరు అభినందనీయం. దీన్ని బట్టి పర్యాటక ఆటగాళ్లు పక్కా ప్రణాళికతో, పూర్తిగా సన్నద్ధమై బరిలోకి దిగారన్న విషయం అర్థం అవుతోంది. వాంఖడేలో ఆతిథ్య జట్టు తేలిపోయిందన్నది వాస్తవం. కానీ, ఒక్క పరాజయంతో కోహ్లీసేనను తక్కువ చేయలేం. అందుకే, టీమిండియా వెంటనే పుంజుకోవాలని అభిమానులతో పాటు ఆటగాళ్లూ భావిస్తున్నారు. పుణెలో బ్లాక్‌ క్యాప్స్‌ జట్టును ఓడించి సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. తనకు 200వ వన్డే అయిన గత మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అద్భుత శతకం చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

కానీ, అతనికి సహచరుల నుంచి సహకారం కరువైంది. కోచ్‌ రవిశాస్ర్తి కూడా ఇదే మాట చెబుతూ మిగతా ఆటగాళ్లూ తగిన బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నాడు. రీ ఎంట్రీలో దినేశ్‌ కార్తీక్‌ ఆకట్టుకున్నాడు. ఐదో నెంబర్‌లో వచ్చి కోహ్లీతో 73 పరుగులు జోడించి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషిం చిన అతనికి మరో అవకాశం లభించడం ఖాయమే. ఇక, మరో 20 ఓవర్ల ఆట మిగిలున్నా.. 42 బంతుల్లో 25 పరుగులతో శుభారంభం చేసినా.. ధోనీ దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అతని నుంచి జట్టు ఇప్పుడు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. బౌలింగ్‌ విషయానికి వస్తే.. బలం అనుకున్న స్పిన్‌ ద్వయం చాహల్‌, కుల్దీప్‌ ఒకే వికెట్‌ తీసి 125 పరుగులు ఇచ్చుకోవడం శోచనీయం. స్వీప్‌ షాట్లతో తమను అలవోకగా ఎదుర్కొన్న లాథమ్‌, టేలర్‌లను అడ్డుకునే మార్గాలను ఈ ఇద్దరూ వెంటనే కనుగొనాలి.

తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న పేసర్లు భువీ, బుమ్రాలను కొనసాగించొచ్చు. ఇక, ముంబైలో ఏకపక్ష విజయంతో కివీస్‌ విశ్వాసం అనూహ్యంగా పెరిగింది. మెరుపు ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు గప్టిల్‌, కొలిన్‌ మన్రోతో పాటు టేలర్‌, లాథమ్‌ అదే జోరును కొనసాగించాలని చూస్తుండగా.. వామప్‌ మ్యాచ్‌లతో పాటు తొలి వన్డేలో నిరాశ పరిచిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పుణెలో బ్యాట్‌ ఝుళిపించాలని చూస్తున్నాడు. పేస్‌ త్రయం ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ, ఆడమ్‌ మిల్నే మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌ పనిపట్టాలని ఆత్రుతగా ఉన్నారు.

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్‌), కేదార్‌, ధోనీ (కీపర్‌), దినేశ్‌, హార్దిక్‌, భువనేశ్వర్‌, చాహల్‌/అక్షర్‌, కుల్దీప్‌, బుమ్రా.
న్యూజిలాండ్‌: గప్టిల్‌, మన్రో, విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, లాథమ్‌ (కీపర్‌), నికోల్స్‌, ఇష్‌ సోధి/గ్రాండ్‌హోమ్‌, శాంట్నర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ, ఆడమ్‌ మిల్నే.

పిచ్‌/ వాతావరణం
ఎస్‌సీఏ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. జనవరిలో ఇక్కడ జరిగిన వన్డేలో ఇంగ్లండ్‌ నిర్దేశించిన 351 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ అలవోకగా ఛేదించింది. అయితే, ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ఇక్కడ స్పిన్‌ వికెట్‌ తయారు చేసి భారత్‌ బొక్కబోర్లాపడింది. బంతి అతిగా తిరిగిన ఈ పిచ్‌కు ఐసీసీ రెఫరీ ‘పూర్‌’ రేటింగ్‌ ఇచ్చాడు. అయితే, ఈ మ్యాచ్‌కు మాత్రం బ్యాటింగ్‌ వికెట్‌ను సిద్ధంగా ఉంచారు. ఇక, పుణెలో బుధవారం వర్ష సూచనలు లేవు. 30 డిగ్రీల ఎండకాసే అవకాశముంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here