పోలీస్ వ్యవస్థను మార్చేస్తున్న హిందూపురం ఎస్సై

0
57

పుట్టింది నిరుపేద కుటుంబంలో అయినా తల్లిదండ్రులు, సోదరుడి కలను నిజం చేయాలన్న సంకల్పం.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా పట్టుదలతో పోలీస్‌ ఉద్యోగానికి సెలెక్ట్‌ అయ్యారు. నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ పోలీస్‌ వ్యవస్థలోకి నైతిక విలువలతో కూడిన యువతను తీసుకురావాలన్న తపనతో ఎందరికో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఆయనే హిందూపురం రూరల్‌ మండలం పోలీస్‌ స్టేషన్ ఎస్‌ఐగా పనిచేస్తున్న చండ్రాంజనేయులు.

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం బొడ్డిరెడ్డిపల్లికి చెందిన లక్ష్మయ్య, వెంకటమ్మల రెండో కుమారుడైన చండ్రాంజనేయులు 1982లో జన్మించారు. 10వ తరగతి వరకూ అదే మండలంలో విద్యనభ్యసించారు. తిరుపతిలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఎంసెట్‌ రాశారు. ఎంసెట్‌లో ర్యాంకు రాకపోవడంతో లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని ఎలాగైనా ర్యాంకు సాధించాలన్న తపనతో చదువుకొంటూనే మరో పక్క కూలి పనులకు సైతం వెళ్లారు. తమ్ముడి కష్టాన్ని చూసిన అన్న మునీంద్ర ఎలాగైనా తమ్ముడిని చదివించాలన్న తపనతో ఆ దిశగా ప్రోత్సహించారు. తిరుపతి ఎస్‌వీ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్న సమయంలో 2000 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు ఆంజనేయులు. పదేళ్లపాటు ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దులో స్పెషల్‌ పార్టీలో పనిచేశారు. 2009లో ఎస్‌ఐ నోటిఫికేషన్ పడటంతో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. 2011 నుంచి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, సోమందేపల్లి, హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లలో పనిచేసి ప్రస్తుతం హిందూపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన విధి నిర్వహణలో ఎన్నో రివార్డులు, అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.

నేటి సమాజంలో యువత పెడదారి పట్టకుండా సొంతకాళ్లపై నిలబడితే ఆ కుటుంబ స్థితిగతుల్లో మార్పు వస్తుందని ఆ దిశగా యువతను ప్రోత్సహించాలని కలలు కన్నారు. సోమందేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడ క్రీడా మైదానంలో కొంతమంది యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రాక్టీస్‌ చేస్తుండగా వారిని గమనించిన ఎస్‌ఐ ఆంజనేయులు వారికి తనవంతు సహకారం అందించాలని సంకల్పించారు.

అనుకున్నదే తడవుగా వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించారు. కోచ్‌లతో, స్టడీ మెటీరియల్‌ అందజేసి 50 మందికిపైగా యువకులకు శిక్షణ ఇప్పించగా 12మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో కొంతమంది ఆయన వద్దకు వచ్చి వారి కుటుంబ పరిస్థితులను చెప్పాక మరికొంత మందిని తీర్చిదిద్దాలన్నా ఆలోచనకు బీజం పడింది. 2014లో హిందూపురంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే కానిస్టేబుల్‌ నోటిఫికేషన్ పడగా గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఎవరైనా ముందుకొస్తే శిక్షణ ఇప్పిస్తామని ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనతో 250 మంది యువత ముందుకు రాగా స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో 170 మంది ఎంపికయ్యారు. ఇందులో పోలీస్‌ వ్యవస్థలో అర్హత సాధించగలరన్న వారిని 70 మందిని ఎంపిక చేసుకుని శిక్షణకు అందించారు.

హైదరాబాద్‌ నుంచి స్టడీ మెటీరియల్‌, నైపుణ్యం కలిగిన కోచ్‌లను పిలిపించి మూడు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. తన తపనకు దాతల సహకారం తోడవడంతో స్టడీ మెటీరియల్‌తో పాటు వారికి మంచి ప్రావీణ్యం ఉన్న అధ్యాపకులచేత శిక్షణతో పాటు భోజన వసతి కల్పించారు. 70మంది ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలకు ఎంపిక కాగా వీరిలో 55 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. జనవరిలో జరిగిన కానిస్టేబుల్‌ రాత పరీక్షల్లో 32 మందికి 80-90మార్కులు వచ్చే అవకాశం ఉండగా, 10మందికి పైగా వంద మార్కులు సాధిస్తారన్న ధీమా ఉంది. ఉచితంగా శిక్షణ అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఆంజనేయులును పోలీస్‌శాఖతో పాటు పలువురు అభినందిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో ఉన్న చెడు భావనను తొలగించి, పోలీస్ వ్యవస్థను నీతి, నిజాయితీ, అంకిత భావం అనే లక్షణాలతో నింపాలని ఆంజనేయులు కృషి చేస్తున్నారని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

విలువలతో కూడిన పోలీస్‌ వ్యవస్థ కోసమే
– ఆంజనేయులు, ఎస్‌ఐ
పోలీస్‌ వ్యవస్థలోకి విలువలతో కూడిన యువతను తీసుకురావలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం. తల్లిదండ్రులు, అన్నయ్య పడిన కష్టాలు చూసి ఉద్యోగం సంపాదించా. ఒకరికి ఉద్యోగం వచ్చే విధంగా దోహదపడితే 10 కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని నిరుపేద యువతీయువకులకు పోలీస్‌ శిక్షణ ఇప్పిస్తున్నా. యువతకు ఉద్యోగం లభిస్తే పెడదారి పట్టకుండా వారి కుటుంబాల్లో స్థితిగతులు మారి మరికొంతమందికి దోహదపడతారు. ఉన్నతాధికారులు ఇస్తున్న సహకారం, ప్రోత్సాహంతో నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే యువతకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నా. భవిష్యత్తులో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ముందుకొస్తే దాతల సహకారంతో పలువురికి శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తా. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here