బ్యాంకింగ్‌ ప్రక్షాళన ప్రధాన ఎజెండా

0
39

ఎన్‌పిఎలపై దిక్కుతోచని స్థితిలో సర్కారు.. అమెరికా టూర్‌లో అరుణ్‌ జైట్లీ
వాషింగ్టన్‌: బ్యాంకింగ్‌ రంగానికి గుది బండగా మారిన మొండి బకాయి(ఎన్‌పిఎ)ల సమస్యను ఎలా పరిష్కరించాలో మోదీ సర్కార్‌కు అర్థం కావడం లేదు. బ్యాంకుల మొండిపద్దుల విషయంలో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. పరిష్కారం అనుకొన్నది కాస్తా సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశం ఉన్నందున ఈ విషయంలో జాగ్రత్తగా ముందడుగు వేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఐఎం ఎఫ్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన జైట్లీ, బ్యాంకుల రుణ వితరణ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్‌ రంగాన్ని సమూలంగా సంస్కరించడం తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని చెప్పా రు.

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘బ్యాంకింగ్‌ రంగంలో పెద్ద మొత్తం లో పేరుకు పోయిన ఎన్‌పిఎలు మా ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. దీంతో కంపెనీల రుణ అవసరాలు తీర్చడం కష్టంగా ఉంది. వృద్ధికి అవసరమైన రీతిలో రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ఎలా బలోపేతం చేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాం’ అన్నారు. అయినా దేశీయ బ్యాంకింగ్‌ రంగం మూలధన అవసరాలను పటిష్ఠం చేసేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భారత్‌లో కేవలం పిఎ్‌సయు బ్యాంకుల్లోనే ఎన్‌పిఎల మొత్తం 6.41 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ప్రైవేట్‌ రంగంలో ముఖ్యంగా చిన్న, మధ్య తరహా కంపెనీ(ఎస్‌ఎంఇ)ల్లో పెట్టుబడులు నీరసించడానికి ఈ ఎన్‌పిఎలూ ప్రధాన కారణమని జైట్లీ తెలిపారు.

పెద్ద కంపెనీల కంటే ఎస్‌ఎంఇలకే బ్యాంకింగ్‌ రంగం నుంచి ఎక్కువగా చేయూత కావలసి ఉంటుందన్నారు. అవసరమైతే పెద్ద పెద్ద కంపెనీలు రుణ పత్రాలు జారీ చేసి లేదా విదేశీ మార్కెట్ల నుంచి చౌకగా నిధులు సమీకరించుకునే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఎంఇలకు మాత్రం ఆ అవకాశం ఉండదన్నారు. దేశీయ ఉపాధి రంగంలో చిన్న కంపెనీల వాటానే ఎక్కువని వివరించారు. ‘ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను చక్కదిద్దేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఎన్‌పిఎలతో కుంగిపోతున్న బ్యాంకులను గాడిలో పెట్టే చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం’ అన్నారు. దేశంలో ప్రైవేట్‌ రంగం శరవేగంగా విస్తరిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

నోట్ల రద్దు మౌలిక సంస్కరణ
పెద్ద నోట్ల రద్దును జైట్లీ మరోసారి సమర్ధించుకున్నారు. ఇది పన్నుల చెల్లింపుకు పెద్దగా ఆసక్తి చూపని భారత సమాజాన్ని, పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చే సమాజంగా మార్చే అతి పెద్ద మౌలిక సంస్కరణ అన్నారు. దీంతో దేశంలో డిజిటల్‌ చెల్లింపులతో పాటు పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. స్వల్ప కాలంలో కొన్ని సమస్యలు ఉన్నా దీర్ఘ కాలంలో మాత్రం పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు మేలే జరుగుతుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. ఆదాయానికి మించి బ్యాంక్‌ డిపాజిట్లు ఉన్న 18 లక్షల మందిని ఇప్పటికే గుర్తించినట్టు చెప్పారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here