మంటలు రేపుతున్న సూరీడు!

0
83

సూర్యుడిపై మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. వారం రోజులుగా ఇదే తంతు. సన్‌స్పాట్‌ రీజన్‌ 2673పై ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పుల వల్ల ఈ మంటలు చెలరేగుతుంటాయని మనకు తెలుసు. 11 ఏళ్లకు ఒకసారి ఈ మంటల సంఖ్య, తీవ్రత పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం మంటల సంఖ్య, తీవ్రత తగ్గాలి.

అయినాసరే చాలా పెద్ద స్థాయిలో మంటలు ఎగసిపడుతుండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మంటలను సాధారణంగా ఎ, బి, సి, ఎం, ఎక్స్‌ వర్గాలుగా గుర్తిస్తుంటారు. ఎ కంటే బి పది రెట్లు, బి కంటే సి ఇంకో పదిరెట్లు ఇలా ఎక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. కొన్ని రోజుల క్రితం వరకు భూమికి అభిముఖంగా ఉన్న సన్‌స్పాట్‌ 2673పై వెలువడిన మంటలు ఎం క్లాస్‌ నుంచి ఎక్స్‌ క్లాస్‌ వరకు ఉండటం గమనార్హం. సెప్టెంబర్‌ 6న కొన్ని ఎం క్లాస్‌ మంటలు చెలరేగాయి. ఆ తరువాత రెండు రోజుల పాటు ఎక్స్‌ క్లాస్‌ స్థాయి మంటలు రేగాయి. సెప్టెంబర్‌ 10న ఏకంగా ఎక్స్‌ 9.3 స్థాయిలో అతిపెద్ద మంట చెలరేగింది. ఈ మంటల సమయంలో సూర్యుడి ఉపరితలం నుంచి ఎగజిమ్మే ప్లాస్మా కారణంగా కొన్ని కణాలు కక్ష్యల్లో తిరుగుతున్న ఉపగ్రహాలను సైతం నాశనం చేయగలవు.