మహానుభావుడు’ రివ్యూ

0
41

నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేష‌న్స్‌
తారాగ‌ణం: శ‌ర్వానంద్‌, మెహ‌రీన్‌, నాజ‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు త‌దిత‌రులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్
ఛాయాగ్ర‌హ‌ణం: నిజ‌ర్ ష‌ఫీ
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత‌లు: ప్ర‌మోద్‌, వంశీ
ద‌ర్శ‌క‌త్వం: మారుతి

ఈ త‌రం యువ క‌థానాయ‌కుల్లో వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్నాడు శ‌ర్వానంద్‌. ఈ ఏడాది రాధ చిత్రంతో మంచి విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయిన శ‌ర్వానంద్ కామెడీ జోన‌ర్‌లో చేసిన ప్ర‌య‌త్న‌మే `మ‌హానుభావుడు`. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందింది. మారుతి గ‌తంలో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో హీరో మెమొరీ లాస్ ప‌ర్స‌న్‌గా క‌న‌ప‌డ‌తాడు. ఆ సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు మ‌హానుభావు చిత్రంలో హీరో క్యారెక్ట‌ర్ ఓసీడీ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డే వ్య‌క్తిగా చూపించాడు మారుతి. ఈ సినిమాతో మ‌రి శ‌ర్వానంద్‌, మారుతి హిట్ కొట్టారా? అస‌లు మారుతి ఈ సినిమా ద్వారా ఎలాంటి కామెడీ తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశాడు? అస‌లు ఓసీడీ స‌మ‌స్య‌కు, ప్రేమ‌కు మ‌ధ్య రిలేష‌న్‌ను ఎలా ఆవిష్క‌రించాడో తెలుసుకోవాలంటే ముందు క‌థంటే తెలుసుకుందాం.

క‌థ‌:
ఆనంద్ (శ‌ర్వానంద్‌) సాఫ్ట్ వేర్ ఎంప్లాయీ. అతి శుభ్ర‌త‌ను ప్రేమిస్తాడు. అంటే ఓసీడీ ల‌క్ష‌ణాలున్న పాత్ర అన్న‌మాట‌. ఎదుటివారు శుభ్ర‌త‌ను పాటించ‌క‌పోయినా, ఆఖ‌రికి క‌ర్చీఫ్ అడ్డుపెట్టుకోకుండా తుమ్మినా కూడా భ‌రించ‌లేని మ‌న‌స్త‌త్వం అత‌నిది. అత‌నిలాగే ఆలోచించే మేఘ‌న (మెహ‌రీన్‌) ను ఇష్ట‌ప‌డతాడు. అత‌ని ప్రేమ‌ను అర్థం చేసుకున్న మేఘ‌న త‌న తండ్రి (నాజ‌ర్‌)ను సిటీకి పిలిపించి ఆనంద్‌తో మీటింగ్ అరేంజ్ చేస్తుంది.

కానీ అక్క‌డ ఆ తండ్రి ప్ర‌వ‌ర్త‌న ఆనంద్‌ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అయినా ఓర్చుకుని మేఘ‌న మీద త‌న‌కున్న ప్రేమ‌ను వెల్ల‌డించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు ఆనంద్‌. ఆ క్ర‌మంలోనే మేఘ‌న తండ్రి అస్వ‌స్త‌త‌కు గుర‌వుతాడు. కానీ ఆనంద్‌కి ఉన్న ఓసీడీ ల‌క్ష‌ణాల వ‌ల్ల హాస్పిట‌ల్‌కి వెళ్ల‌లేక‌పోతాడు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న మేఘ‌నకు కోపం తెప్పిస్తుంది. అయితే ఆమె తండ్రి మాత్రం ఆనంద్‌ని ఇష్ట‌ప‌డ‌టం మొద‌లుపెడ‌తాడు. వారితో పాటు వాళ్ల ఊరికి తీసుకెళ్తాడు. సిటీలో క్లీన్‌గా ఉండ‌టానికి అల‌వాటు ప‌డ్డ ఆనంద్‌, ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణాన్ని ఎలా ఇష్ట‌ప‌డ్డాడు? అక్క‌డ అస‌లు ఎలా అడ్జ‌స్ట్ కాగ‌లిగాడు? ప‌ల్లెటూర్లో మేఘ‌న కుటుంబానికి ఉన్న స‌మ‌స్య ఏంటి? ఆనంద్ మీద ఆ ఊర్లో ఎందుకు దాడి జ‌రిగింది? ఇంత‌కీ ఆనంద్‌లో ఓసీడీ ల‌క్ష‌ణాలు కంటిన్యూ అయ్యాయా? లేవా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్స్
ఓసీడీ అనే పాయింట్ తెలుగు తెర‌కు కొత్త‌. ఈ పాయింట్ ఆధారంగా క‌థానాయ‌కుడి పాత్ర‌ను అల్లుకోవ‌డం బావుంది. ప‌రిస‌రాల‌కు త‌గ్గ‌ట్టు స‌ర్దుకుని పోలేనివారు ఎలాంటి ఇబ్బందుల‌కు గుర‌వుతారో చెప్పే ప్ర‌క్రియ‌లో కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. అతి శుభ్ర‌త‌గ‌ల వ్య‌క్తిగా శ‌ర్వానంద్ న‌ట‌న‌, అత‌ను ప్రేమించే ఊరిపెద్ద కూతురి పాత్ర‌లో మెహ‌రీన్‌, ఆనంద్ క‌జిన్ కిశోర్ గా వెన్నెల‌కిశోర్ పాత్ర‌లు మెప్పిస్తాయి. నాజ‌ర్‌, టిల్లు వేణు, ర‌ఘుబాబు, ర‌జిత త‌దిత‌రులంతా ఆయా పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. పాట‌లు పెద్ద‌గా ఇంప్రెసివ్‌గా అనిపించ‌వు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. లొకేష‌న్లు కూడా బావున్నాయి. ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల‌ను రాసుకున్న తీరు బావుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాల ప‌నితీరు ప్ర‌శంస‌నీయం.

మైన‌స్ పాయింట్లు
ఓసీడీ అనే పాయింట్‌ను మిన‌హాయిస్తే సినిమా చాలా పాత కాన్సెప్టే. స‌ర్వ‌త్రా ఓట్లు, ఎన్నిక‌లు వ‌చ్చిన ఈ కాలంలో ఇంకా కుస్తీ పోటీల ద్వారా స‌ర్పంచి కుర్చీల‌కు ఎంపిక జ‌రుగుతాయ‌న‌డం సినిమాటిక్‌గా బావుందేమో కానీ, నిజ జీవితంలో చూడ‌లేమేమో. ఓసీడీ పాయింట్‌ను ఎలివేట్ చేయ‌డంతోనే ఫ‌స్టాఫ్ మొత్తం సాగిపోయింది. సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ లు ఏమీ లేవు. పైగా ఓసీడీ ల‌క్ష‌ణాల‌ను దాటి హీరో కుస్తీ పోటీల్లో ఎలా పాల్గొంటాడ‌న్న‌ది కూడా స్ట్రాంగ్‌గా చెప్పలేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. అప్ప‌టికే ఏడేళ్లుగా కుస్తీ పోటీల్లో విజ‌యాన్ని సాధించిన వ్య‌క్తిని అస‌లు కుస్తీ శిక్ష‌ణ‌కు అడుగైన పెట్ట‌ని హీరో కొట్టేయ‌డం, గెలిచేయ‌డం న‌మ్మ‌శ‌క్యంగా ఉండ‌దు. క‌థ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బావుండేది.

విశ్లేష‌ణ:
ఓ మాన‌సిక స‌మస్య‌తో మాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి, త‌న మ‌న‌సుకు ఎదురైన ప్ర‌తికూల పరిస్థితుల నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌నేదే మ‌హానుభావుడు సింపుల్ కాన్సెప్ట్‌. మ‌న‌సుకు ప‌ట్టిన మురికి వ‌దిలించుకుంటే ప్ర‌తి వ్య‌క్తి మ‌హానుభావుడే అవుతాడ‌న‌డం సినిమా ప‌ర‌మార్థం. ఈ లైన్‌కు ద‌ర్శ‌కుడు న్యాయం చేస్తూ ఓ ఓసీడీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే యువ‌కుడు, ప్రేమ‌లో ప‌డ‌తాడు. అతి శుభ్ర‌త‌ను అనేది కూడా ఓ మానసిక రోగ‌మే. అలాంటి ఇబ్బందిని ఎదుర్కొనే హీరో, త‌న ప్రేమ‌ను ఎలా గెలిపించుకున్నాడ‌నేదే సినిమా క‌థాంశం. టైటిల్ రోల్‌లో న‌టించిన శ‌ర్వానంద్ త‌న పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయాడు. సిటీలో అతి శుభ్ర‌త‌ను పాటిస్తూ, శుభ్ర‌త‌ను పాటించని వారిని తిడుతూ ఉంటే హీరో, హీరోయిన్‌ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ కోసం ఆమె ఊరికి వెళ్లి, అక్క‌డ వ్య‌క్తుల మ‌ధ్య ఎలా మ‌న‌గ‌లిగాడు అనే ఈ క‌థ‌లో ప్ర‌తి సన్నివేశంలో హీరో శ‌ర్వా త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించాడు. శ‌ర్వా కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చ‌క్క‌గా ఉంది. లుక్ ప‌రంగా కూడా త‌ను బావున్నాడు.

ఇక హీరోయిన్ విషయానికొస్తే..
మెహ‌రీన్ న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో న‌టించింది. మేఘ‌న‌గా ఒక ప‌క్క తండ్రిని, మ‌రో ప‌క్క ప్రేమ‌ను వదులుకోని క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌గా న‌టించింది. తెర‌పై అందంగా క‌న‌ప‌డింది. త‌మ‌న్ సంగీతం బాలేదు. క‌థ, క‌థ‌నాలు బావుండ‌టంతో త‌మ‌న్ సంగీతం సో సోగా ఉన్నా, ప‌ట్టించుకోలేదు. న‌జ‌ర్ ష‌ఫీ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సీన్స్‌ను అందంగా త‌న కెమ‌రాలో బంధించాడు. ఇక ద‌ర్శ‌కుడు మారుతి గురించి చెప్పాలంటే భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో హీరోను డిసార్డ‌ర్ ఉన్న వ్య‌క్తిగా చూపించి హిట్ కొట్టాడు.

ఈసినిమాలో కూడా హీరోకు ఓసీడీ అనే డిసార్డ‌ర్‌ను పెట్టి, దానికి ల‌వ్‌ను లింక్ చేసి చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. క‌థ‌లోకామెడీని చొప్పించిన తీరు బావుంది. ఆడియెన్స్‌కు కామెడీ ట్రాక్ చ‌క్క‌గా క‌నెక్ట్ అవుతుంది. నాజ‌ర్ కుటుంబ పెద్ద క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌గా న‌టించాడు. ఇక వెన్నెల‌కిషోర్ పాత్ర కూడా బావుంది. పాత్ర ప‌రంగా మిగిలిన న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. క‌థ‌లో హీరో క్యారెక్టరైజేష‌న్ మిన‌హా కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌దు. క‌థ ఫ్లాట్‌గా ఉంది. ఫైన‌ల్‌గా ఏంజ‌రుగుతుంద‌నేది ప్రేక్ష‌కుడికి అవ‌గత‌మైపోతుంది. మొత్తంగా చూస్తే మ‌హానుభావుడు సినిమాను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు.

బోట‌మ్ లైన్: మెప్పించే మ‌హానుభావుడు
రేటింగ్: 3/5

‘శ్రియను ఆ సినిమాలో అనవసరంగా తీసుకున్నారు’

దేవుడిని నమ్మని ఆ హీరో మరి ఆ పని ఎందుకు చేసినట్టు?  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here