మేం కేటీఆర్‌ బంధువులం

0
220

చెప్పినట్లు వినకపోతే అంతే
డమ్మీ తుపాకీతో భయపెట్టి కంపెనీని టేకోవర్‌ చేసిన కేటుగాళ్లు
బుగ్గ కారు పెట్టుకుని దర్జాగా రాకపోకలు
ఇద్దరి అరెస్ట్‌.. ఒక కారు స్వాధీనం
వారిలో ఒకరు కోనరావుపేట ఎంపీపీ బంధువు
రాయదుర్గం, సెప్టెంబరు 19: ‘‘మేం మంత్రి కేటీఆర్‌ బంధువులం. నిరుద్యోగులను మోసం చేసి డబ్బు సంపాదిస్తావా? చెప్పినట్లు విను.. లేకపోతే అంతే సంగతులు!’’.. అని ఒక కంపెనీ డైరెక్టర్లను బెదిరించి, దాన్ని టేకోవర్‌ చేసిన ఇద్దరు కేటుగాళ్లను రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఒకరు.. కోనరావుపేట ఎంపీపీ శ్రవణ్‌రావుకి సమీప బంధువు, సిరిసిల్ల జిల్లా కొలనూర్‌ గ్రామానికి చెందిన వంశీకృష్ణారావు. మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. సాయిచరణ్‌, అభిషేక్‌ అనే వ్యక్తులు ఖాజాగూడలో గ్రోవిస్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోగా బ్యాక్‌డోర్‌ ద్వారా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దాదాపు 150 మంది నిరుద్యోగులకు వల వేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షన్నర దాకా వసూలు చేశారు. ఇదంతా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగింది. ఇప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో.. తమ డబ్బు తిరిగివ్వాలంటూ వారిని పలుమార్లు వేడుకున్నారు.

అయినా డబ్బు ఇవ్వకపోవడంతో.. నెల్లూరుకు చెందిన ఇద్దరు బాధితులు నాగరాజు, సాయిరామ్‌ తమ డబ్బులు ఇప్పించాలని కోరుతూ వంశీకృష్ణారావును కలిశారు. అతడు తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి రంగంలోకి దిగి.. గ్రోవిస్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్లు సాయి చరణ్‌, అభిషేక్‌ను కిడ్నాప్‌ చేశారు. వారి నుంచి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. వారు రూ.5 లక్షలు చెల్లించారు. మరో రూ.5 లక్షలను చెల్లించకపోవడంతో.. కేటీఆర్‌ తన సమీప బంధువని చెబుతూ వంశీకృష్ణారావు ఆ కంపెనీని టేకోవర్‌ చేసుకున్నాడు. తమ కోసం రంగంలోకి దిగిన వంశీకృష్ణారావు కంపెనీనే ఆక్రమించుకోవడంతో నాగరాజు, సాయిరామ్‌ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం బెంగళూరులో వంశీ, రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయిచరణ్‌, అభిషేక్‌ కూడా నిందితులేనని.. వారినీ అరెస్టు చేస్తామని తెలిపారు.

జల్సాల కోసం దందాలు..
బీబీఎం పూర్తి చేసిన వంశీకృష్ణారావు.. బీటెక్‌ చదివిన రాహుల్‌.. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం సెటిల్‌మెంట్ల దందా మొదలుపెట్టారు. దీనికోసం ఆన్‌లైన్‌లో రూ.40 వేలకు ఒక డమ్మీ తుపాకీని కొనుగోలు చేశారు. తమ కారుకు వీఐపీలు ఉపయోగించే నీలం రంగు బుగ్గను తగిలించి వీఐపీలుగా బిల్డప్‌ ఇచ్చేవారు. షాద్‌నగర్‌ ఠాణా పరిధిలో జూలై రెండో వారంలో రాయకల్‌ గేటు వద్ద టోల్‌గేటు సిబ్బందిని డమ్మీ పిస్తోలుతో బెదిరించారు. టోల్‌గేట్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు షాద్‌నగ ర్‌ పోలీసలు కేసు నమోదు చేసి ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.