యునెస్కో నుంచి వైదొలగిన అమెరికా

0
126

ఐక్యరాజ్యసమితికి డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌
ఇజ్రాయెల్‌ వ్యతిరేక విధానాలపై నిరసన
వాషింగ్టన్‌, అక్టోబరు 12: ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) నుంచి అమెరికా నిష్క్రమించింది. యునెస్కో నుంచి వైదొలిగినట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారికంగా ప్రకటించింది. 2018 డిసెంబరు 31 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. అయితే శాశ్వత పరిశీలకుడి హోదాలో కొనసాగుతామని తెలిపింది. ఆ సంస్థ అనుసరిస్తున్న ఇజ్రాయెల్‌ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అఽధికార ప్రతినిధి హెదర్‌ నవర్ట్‌ వెల్లడించారు. ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదని, యునెస్కోలో పేరుకుపోయిన బకాయిలపై అమెరికా ఆందోళనలకు ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోందని అన్నారు. యునెస్కోలో సమూల సంస్కరణలు జరగాలని ఆమె అన్నారు. అమెరికా నిర్ణయంపై యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇది బహుళత్వానికి నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. యునెస్కో కొత్త డైరెక్టర్‌ కోసం ఓటింగ్‌కు వెళ్తున్న సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది.

అమెరికా నిర్ణయం వెనుక..!
యునెస్కో నుంచి అమెరికా వైదొలగడానికి.. పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదానికి లింకుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా చిరకాల మిత్రదేశం. అయితే పాలస్తీనాను ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక దేశంగా గుర్తించటం అమెరికాకు ఇష్టంలేదు. అలాంటిది 2011లో పాలస్తీనా అఽథారిటీకి యునెస్కో సభ్యత్వం ఇచ్చింది. దీనిపై అప్పట్లో అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అప్పటి నుంచి.. ఆ సంస్థకు నిధుల పంపిణీని నిలిపివేసింది. కానీ, ప్యారి్‌సలోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చింది.

అయితే కొంత కాలంగా యునెస్కో అనుసరిస్తున్న ఇజ్రాయెల్‌ వ్యతిరేక విధానాలపై అమెరికా యూఎన్‌ అంబాసిడర్‌ నిక్కీ హేలీతో పాటు పలు సీనియర్‌ అధికారులు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యునెస్కో నుంచి అమెరికా నిష్క్రమించింది. అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్‌ హర్షం వ్యక్తంచేసింది.
యునెస్కో నుంచి అమెరికా వైదొలగటం ఇదే తొలిసారి కాదు. సోవియట్‌ యూనియన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలతో 1984 లో రొనాల్డ్‌ రీగన్‌ హయాంలో యునెస్కో నుంచి నిష్క్రమించింది. అయితే జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ హయాంలో 2002లో మళ్లీ యునెస్కోలో చేరింది.