వారానికి 4 రోజులే?

0
50

పాదయాత్రపై జగన్‌ యోచన
ఆదివారం నుంచి బుధవారం వరకు
గురు, శుక్ర, శనివారాల్లో విరామం
రేపు వైసీపీ భేటీలో తుది నిర్ణయం
యాత్ర ప్రారంభం 6కు వాయిదా
ద్వితీయ విఘ్నం ఉండొద్దనే మార్పు!
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుకాకుండా 6 నెలలపాటు మినహాయింపు ఇవ్వాలన్న తన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో.. వారంలో నాలుగు రోజులు మాత్రమే పాదయాత్ర నిర్వహించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు.. ఆ పాదయాత్రను మళ్లీ వాయిదా వేసుకున్నారు. 2వ తేదీ నుంచి గాకుండా ఆరో తేదీ నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు.

వాస్తవానికి ఆయన తొలుత చేసిన ప్రకటన ప్రకారం.. ఈ నెల 27 నుంచే పాదయాత్రను ప్రారంభించాల్సి ఉండగా.. ఆ రోజు మంచి రోజు కాదని జ్యోతిష్కులు హెచ్చరించడంతో నవంబరు 2కి వాయిదావేసుకున్నారు.

తాజాగా వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్‌ వేసిన పిటిషన్‌ను సోమవారం సీబీఐ కోర్టు కొట్టేశాక.. జగన్‌ తన ఆంతరంగికులతో భేటీ అయ్యారు. నవంబరు రెండో తేదీ గురువారం కావడం.. మూడో తేదీన శుక్రవారం సీబీఐ కోర్టుకు ఆయన హాజరు కావలసి ఉంది. పాదయాత్ర మొదలుపెట్టిన మర్నాడే విరామమివ్వడం.. ద్వితీయ విఘ్నం మంచిది కాదని ఆంతరంగికులు సూచించడంతో దానిని ఆరోతేదీకి జగన్‌ వాయిదా వేసుకున్నారు. పాదయాత్రకు వెళ్లే ముందు 4వ తేదీన తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని.. మర్నాడు కడప చర్చిలో ప్రార్థనలు జరపాలని నిర్ణయించారు.

యాత్ర తీరుపై మంతనాలు..
నవంబరు 6 నుంచి పాదయాత్ర ఆరంభించాక.. వారంలో ఎన్ని రోజులు చేపట్టాలన్న అంశంపై జగన్‌ అత్యంత సన్నిహిత వర్గాలతో మంతనాలు జరిపారని సమాచారం. ఒకసారి ఆరు రోజులు, మరోసారి ఐదు రోజులు.. ఇంకోసారి నాలుగు రోజులు చేపడితే.. యాత్ర కంగాళీగా మారుతుందని, ఏకరూపత ఉండేలా చూడాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. దరిమిలా వారంలో నాలుగు రోజులు చేపట్టడమే మంచిదన్న నిర్ణయానికి జగన్‌ వచ్చినట్లు తెలిసింది.

ప్రతి శుక్రవారం న్యాయస్థానంలో హాజరు కావలసి ఉన్నందున.. యాత్ర ఎక్కడ జరుగుతున్నా ప్రతి గురువారం సాయంత్రం విరామమిచ్చి హైదరాబాద్‌కు హడావుడిగా బయల్దేరాల్సి ఉంటుందని.. రాయలసీమ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో లేదా విమానంలో చేరుకోవడం సాధ్యపడుతుందని.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల్లో యాత్రలో ఉంటే మాత్రం గురువారం మధ్యాహ్ననికే యాత్రకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందని సన్నిహితులు పేర్కొన్నారు.

ఇలా ప్రతి గురువారం పాదయాత్రను ఏదో సమయంలో అర్ధాంతరంగా ఆపేసి హైదరాబాద్‌ బయల్దేరితే.. ఆ అంశమే ప్రసార మాధ్యమాల్లో ప్రధానాంశంగా మారుతుందని.. ఇది ప్రతికూల సంకేతాలు పంపుతుందని వివరించారు. ‘అందువల్ల బుధవారం రాత్రికే యాత్రను ఆపేసి.. గురువారం హైదరాబాద్‌ చేరి.. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరై.. శనివారం పార్టీ పరమైన సమీక్షలు నిర్వహించి.. మళ్లీ ఆదివారం యాత్రను పునఃప్రారంభించాలి. ఇంతకంటే గత్యంతరం లేదు’ అని అభిప్రాయపడ్డాయి. పైగా నాలుగు రోజులు మాత్రమే పాదయాత్ర జరిపితే.. ప్రయాణ బడలిక కూడా లేకుండా పాదయాత్రను కొనసాగించవచ్చని సూచించారు. దీనిపై గురువారం (ఈ నెల 26) జరిగే వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో.. వైసీపీ శాసనసభాపక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం.

తీర్పుపై అప్పీలుకు వెళ్లరు..?
వాస్తవానికి సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని జగన్‌ భావించారు. సన్నిహితులు మాత్రం అక్కడ కూడా ప్రతికూల తీర్పు వెలువడితే.. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. విచారణ సమయంలో ఉన్నత న్యాయస్థానాలు ప్రతికూల వ్యాఖ్యానాలు చేస్తూ తీర్పు చెబితే.. గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని వారు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో.. సీబీఐ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న ఆలోచనను జగన్‌ దాదాపు విరమించుకున్నట్లేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here