వేస్టేజ్‌ తో కూలర్‌ !

0
49

ఆలోచనలు ఉంటే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టాలి. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయత్నించాలి. పరిస్థితులు అనుకూలించకపోయినా.. విధి వెక్కిరించినా.. సంకల్పంతో ముందడుగు వేయాలి. అప్పుడు ఓటమి కూడా వెన్ను చూపుతుంది. ఈ ఢిల్లీ కుర్రాడే అందుకు ఉదాహరణ. కూలర్‌ కొనేంత ఆర్థిక స్థోమత లేదని తెలుసుకున్న పదమూడేళ్ల మొహమ్మద్‌ హసన్‌ .. వ్యర్థ పదార్థాల నుంచి ఓ మినీ కూలర్‌ తయారు చేసి.. శభాష్‌ అనిపించుకున్నాడు.

అది ఎండాకాలం. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో భానుడి భగభగలు తారాస్థాయికి చేరాయి. ఢిల్లీ, ఘాజీపూర్‌కు సమీపంలోని ‘భల్‌స్వా’ ప్రాంతంలో చెత్త ఏరుకునే కుటుంబాలు నివాసం ఉంటాయి. అక్కడే జీవనం
కొనసాగించే పదమూడేళ్ల మొహమ్మద్‌ హసన్‌ ఎండల్ని భరించలేకపోయాడు.
ఉక్కపోతకు తట్టుకోలేక వాళ్ల నాన్నతో కూలర్‌ కొనమని అడిగాడు. ‘మనది చెత్త ఏరుకుని బతికే కుటుంబం. కూలర్‌ కొనలేం’ అని ఆ తండ్రి.. కొడుకుతో చెప్పాడు. అంతే హసన్‌ ఆలోచనలో పడ్డాడు. కాసేపు టీవీలో డోరేమన్‌ కార్టూన్‌ సీరియల్‌ చూశాడు. అయినా ఆలోచిస్తూనే ఉన్నాడు. అందులో డోరేమన్‌ వ్యర్థ పదార్థాల నుంచి ఓ ఫ్యాన్‌ తయారు చేస్తాడు. అది చూడగానే హసన్‌కు ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. డంప్‌యార్డులోని వ్యర్థ పదార్థాలను సేకరించాడు. వాటితో కూలర్‌ చేయడం ప్రారంభించాడు. చాలా సార్లు విఫలమయ్యాడు. చివరగా అనుకున్నది సాధించాడు. ఓ మినీ కూలర్‌ తయారు చేసి, తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఎలక్ర్టానిక్‌ పరికరాలు తయారు చేయడం హసన్‌కు కొత్తేం కాదు.

ఇవి కూడా..
ప్లాస్టిక్‌ సీసాలు, బ్యాటరీలు ఉపయోగించి మినీ మోటారు బోట్లు తయారు చేశాడు.
పారేసిన బొమ్మ కార్లతో, మొబైల్‌ ఫోన్లతో ట్రాష్‌ కలెక్టింగ్‌ కారును రూపొందించాడు.
మొబైల్‌ చార్జర్‌ కూడా తయారు చేశాడు.
ఇలా తయారు చేశాడు
మినీ కూలర్‌కు వాడిన పరికరాలన్నీ భల్‌స్వా డంప్‌లోనివే. కూలర్‌ బాడీని కార్డుబోర్డుతో, గ్రిల్‌ని కర్రపుల్లలతో, రెక్కలను ప్లాస్టిక్‌ సీసాలతో తయారు చేశాడు. వాటిని ఓ మోటారుకి అమర్చాడు.రెగ్యులేటర్‌గా ఒక సీసా మూతని ఉపయోగించాడు.

అమ్మానాన్నల కోసం..
‘మా నాన్న నన్ను కష్టపడి చదవమని చెప్పాడు. బాగా చదివి ఉద్యోగం సంపాదిస్తే.. ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నాన్న ఎప్పుడూ చెబుతుంటాడు. అమ్మ, నాన్నలు చదువుకోలేదు. మా అన్నయ్య, చెల్లెలు కూడా మధ్యలోనే చదువు ఆపేశారు. కానీ నేను మాత్రం మెకానికల్‌ ఇంజనీర్‌ కావాలని అనుకుంటున్నాను. అన్ని సబ్జెక్టులూ చదువుతుంటాను, కానీ నాకు సైన్స్‌ అంటే చాలా ఇష్టం. వంటింట్లో అమ్మ కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఉక్కపోత ఉండకుండా, నాన్న పనిచేసి ఇంటికి వచ్చాక హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద కూలర్‌ తయారు చేయాలని అనుకుంటున్నాను.’
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here