సర్కారు బ్యాంకులకు నిధుల వరద

0
57

రూ.2.11 లక్షల కోట్లు సమకూర్చనున్న సర్కారు
ఇక మరిన్ని భారీ సంస్కరణలు: అరుణ్‌ జైట్లీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి దెబ్బకు చతికిలబడిన ఆర్థిక రంగాన్ని ఉత్తేజపరిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా మొండి పద్దుల (ఎన్‌పిఎ) భారం తో చేతులెత్తేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బి)ను ఆదుకునేందుకు 2.11 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో సర్కారు బ్యాంకుల మూలధన అవసరాల కోసం రూ.2.11 లక్షల కోట్లు సమకూర్చనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఈ మొత్తంలో రూ.76,000 కోట్లు బడ్జెట్‌ ద్వారా సమకూర్చుతారు. మరో రూ.1.35 లక్షల కోట్లు మూలధన పునర్‌ వ్యవస్థీకరణ రుణ పత్రాల జారీ ద్వారా సమకూర్చుతారు.

ఆపరేషన్‌ ఇంద్రధనుష్‌ కింద గతంలో ప్రకటించిన రూ.70,000 కోట్ల ప్యాకేజీకి తాజా మొత్తం అదనం. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టిపై ఇంటా బయట తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దాదాపు రూ.8.35 లక్షల కోట్ల మొండి బకాయిలతో సతమతమవుతున్న పిఎస్‌బిలకు ఇది పెద్ద ఓదార్పు అవుతుందని బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. బ్యాంకులకు దండిగా నిధులు అందితే కంపెనీలకు కాస్తా చౌక వడ్డీ రేట్లకు రుణాలు అందే అవకాశం ఉంది. దాదాపు రూ.8 లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండి పద్దుల వల్ల బ్యాంకులు తాజా రుణాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. దీంతో కార్పొరేట్‌ సంస్థలు నిధుల కొరతతో తీవ్రంగా సతమతమవుతున్నాయి. దాని ప్రభావం ఆర్థిక వృద్ధిపై పడింది.

బ్యాంకింగ్‌ సంస్కరణలు
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూల ధనం సమకూర్చడంతో పాటు బ్యాం కింగ్‌ రంగంలో కొన్ని సంస్కరణలూ ఉంటాయని అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఆ సంస్కరణలేంటో మాత్రం వెల్లడించలేదు. వచ్చే కొద్ది నెలల్లో ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు. మూలధన పునర్‌ వ్యవస్థీకరణ రుణ పత్రాల స్వరూప స్వభావాలనీ వెల్లడించలేదు. అవసరమైన సమయంలోనే ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు. దీంతో ఈ సంస్కరణలు ఎలా ఉంటాయోనని బ్యాంకింగ్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటిష్టీకరణ పేరుతో ఎస్‌బిఐ తరహాలో విలీనాలు చేపడితే వేల మంది మిగులు ఉద్యోగులుగా తేలి తర్వాత వారిని ఏదో ఒక పేరుతో రోడ్డున పడేసే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి.

ఆర్థికపునాదులు పటిష్టం
ఎవరేమన్నా భారత ఆర్థిక పునాదులు అత్యంత పటిష్టంగా ఉన్నాయని అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు అనివార్యమని అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన అర డజను మంది సీనియర్‌ అధికారులతో కలిసి జైట్లీ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here